కలం, ఆదిలాబాద్: సాంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలికి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) రైతులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాగుభూమి సంరక్షణ’ రైతు అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
రైతులు అధైర్య పడొద్దు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో సాధారణం కంటే 35 నుంచి 36 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, భీంపూర్ మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిందని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు..
కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతుల పట్ల బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. పాత బకాయిలు, రుణాల వసూళ్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయరాదని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతులకు అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పిప్పల్కోటి రిజర్వాయర్ భూసేకరణ త్వరలో పూర్తి చేస్తాం..
పిప్పల్కోటి రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియకు సంబంధించి అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసి భూములు కోల్పోతున్న రైతులందరికీ నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. జందాపూర్, చందాటి ప్రాంతాల్లో మత్తడి వాగు సమస్యలు, రైతుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు.
అంతకుముందు గ్రామంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ (వీబీ-జీ రామ్ జీ) పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫార్మ్ పాండ్ (వ్యవసాయ క్షేత్ర నీటి కుంట) పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు.

