కలం, సిరికొండ: గ్రామ అభివృద్ధికి అవసరమైన ఏ పనికైనా నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. సిరికొండ మండలంలోని పొన్న గ్రామంలో శుక్రవారం రూ.1.17 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనం, రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం, రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, రూ.40 లక్షలతో చేపట్టనున్న కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే రూ.30 లక్షలతో నిర్మించిన కల్వర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విడతల వారీగా గ్రామాల రూపురేఖలు మారుస్తామని, పొన్న గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇటీవల గ్రామానికి చెందిన రైతు పాండురంగ్ మృతి చెందగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారని తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని పేర్కొన్నారు.

