కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఇప్పటివరకు 75 శాతం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. మిగిలిన కొనుగోళ్లను కూడా వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించామన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 68 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు.
రైతుల ఖాతాల్లో రూ.407 కోట్లు జమ..
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఇప్పటి వరకు 2,29,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు. ఇందుకు సంబంధించి రూ.544.74 కోట్లకు గాను రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.407.21 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మిగతా డబ్బులు ఒకట్రెండు రోజుల్లో జమవుతాయని చెప్పారు. గత నాలుగు రోజుల్లోనే 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని.. ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ, లోడింగ్–అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించడం, లారీలు.. ఇతర రవాణా వాహనాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచడం, రైతులకు తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు.
Read Also: కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి
Read Also: ఆమెకు రక్షణేది..?

