Mobile Popup Ad
Mobile Popup Ad

ఆసియా అండర్-20 మీట్‌కి ఏపీ రన్నర్ ఎంపిక

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. రాబోయే ప్రతిష్టాత్మక ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌(U 20 Championship)లో 800 మీటర్ల పరుగు పందెంలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ఏపీ మధ్యదూర రన్నర్ ఎం. వెంకట్రామ్ రెడ్డి ఎంపికయ్యారు. మే 28 నుంచి 31 వరకు హాంగ్‌కాంగ్‌ వేదికగా ఈ అంతర్జాతీయ పోటీలు జరగనున్నాయి.

ఒక సాధారణ రైతు బిడ్డ అయిన వెంకట్రామ్ రెడ్డి, ఆరేళ్ల పాటు కఠినమైన శిక్షణ, ఎన్నో త్యాగాల తర్వాత ఈ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు. కొడుకును క్రీడాకారుడిగా తీర్చిదిద్దేందుకు అతని కుటుంబం సుమారు 5 లక్షల రూపాయల వరకు అప్పులు చేసింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియకపోయినా, కొడుకు దేశం కోసం పరుగెత్తబోతుండడంపై తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు.

ఇటీవల కర్ణాటకలోని తుమకూరులో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కనబరిచిన అద్భుత ప్రతిభ ఆధారంగానే వెంకట్రామ్ భారత జట్టుకు ఎంపికయ్యారు. గతంలో ఆయన సాఫ్ (SAFF) గేమ్స్‌లో బంగారు పతకం, దక్షిణాసియా సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కాంస్య పతకం సాధించారు. అలాగే ప్రపంచ అండర్-20 ఛాంపియన్‌షిప్‌నకు (U 20 Championship) కూడా ఆయన అర్హత సాధించడం విశేషం.

ప్రస్తుతం బెంగళూరులోని సాయ్ (SAI) కేంద్రంలో ఒలింపియన్ సురేంద్ర సింగ్ పర్యవేక్షణలో వెంకట్రామ్ శిక్షణ పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), సాప్ (SAAP) అందించిన మద్దతు వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. హాంగ్‌కాంగ్ వేదికపై వెంకట్రామ్ పతకం సాధిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఒలింపిక్స్ చేరాలనే అతని లక్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సహాయం అందుతుందని క్రీడా వర్గాలు ఆశిస్తున్నాయి.

Read Also : కర్నూలులో వజ్రాల వేట ప్రారంభం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>