లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో : గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Karimnagar Collector Chitra Mishra) ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ సమావేశం నిర్వహించారు. గర్భస్థ పూర్వ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీపీఎన్‌డీటీ) అమలుపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, డీసీపీ వెంకట రమణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, వైద్యాధికారులు, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Karimnagar Collector Chitra Mishra) మాట్లాడుతూ, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలు, ఆస్పత్రులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అవసరమైతే పోలీసు శాఖ సహకారంతో పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని సూచించారు. పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, జిల్లాలో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ ఈ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు.

అధికారులు సంయుక్తంగా స్కానింగ్ సెంటర్లలో తరచూ తనిఖీలు నిర్వహించాలని నిబంధనలు పాటించని కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడా జరగకుండా పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ, బ్రూణ హత్యలను పూర్తిగా నివారించడంతో పాటు ఆడపిల్లల పట్ల వివక్షను తగ్గించి, మహిళల హక్కులను పరిరక్షించే దిశగా సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అధికారులు అమలు చేయాలని సూచించారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, పీసీపీఎన్‌డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ప్రకృతి, ప్రశాంతి, భువన, ఎన్జీవో ప్రతినిధులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>