కలం, మెదక్ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని నామినేటెడ్ పదవులను భర్తీ చేయకపోవడంపై లోకల్ క్యాడర్ నారాజ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. నర్సాపూర్ సెగ్మెంట్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ, నాలుగు అలయ కమిటీలకు పాలక మండళ్లను నియమించలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన మూడు ఎన్నికల్లో నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా.. అధికారం లేకపోయినా క్యాడర్ మాత్రం పార్టీనే నమ్ముకొని ఉంది. ఇప్పుడు వారిని పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు.
ఎన్నో పదవులు.. కానీ భర్తీలో జాప్యం
నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, శివ్వంపేట మండలం చాకరిమెట్ల హనుమాన్ దేవస్థానం, సికింద్లపూర్ లక్ష్మీ నరసింహఆలయం, కౌడిపల్లి మండలం తునికి నల్లపోచమ్మ ఆలయం, హత్నూర మండలం పలుగు పోచమ్మ ఆలయ దేవస్థానాలకు ఆలయ కమిటీలు ఏర్పాటు చేయలేదు.
మార్కెట్ కమిటీలు పట్టవా?
మర్కెట్ కమిటీ, దేవాలయ పాలక మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరక్టర్లు, మెంబెర్స్‌గా అవకాశాలు దక్కుతాయని కాంగ్రెస్ నేతలు, కింది స్థాయి కార్యకర్తలు ఆశించారు. సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి పదవులు రూలింగ్ పార్టీకే దక్కుతుంటాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆలయ కమిటీ పదవీకాలం రెండేళ్లు ఉంటాయి. ఇప్పటికే కమిటీల నియామకం జరిగిఉంటే ఒక దఫా పదవీకాలం ముగిసేది. రెండో సారి కమిటీ నియమించే అవకాశం ఉండేది. పార్టీ కోసం కష్టపడినవారికి కమిటీల్లో అవకాశం ఉండేదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని, నాలుగు దేవాలయ కమిటీలను ఇప్పటికీ భర్తీ చేయకపోవడం గమనార్హం.
పార్టీని బలోపేతం చేయరా ?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి న్యాయవాది ఆవుల రాజిరెడ్డి.. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డికి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయాడు. ఆయన గెలుపు కోసం క్యాడర్ తీవ్రంగా శ్రమించింది. పదేళ్లపాటు అధికారం లేనపోయినా, పార్టీ మారాలని ఒత్తిడి ఉన్నా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మెజార్టీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. స్థానికంగా ఓడిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు అవకాశాలు వస్తాయని ఆశించారు. నర్సాపూర్‌లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సెకండ్ క్యాడర్‌కు అవకాశం ఇస్తారని అనుకున్నారు. అందుకు భిన్నంగా నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి నామినేటెడ్ పదవులను భర్తీ చేయలేదు. రెండున్నర ఏండ్లు గడుస్తున్నా వ్యవసాయ మార్కెట్ కమిటీ, అలయ పాలక మండలి నియామకం జరగలేదు. దీంతో నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంత్రప్తిగా ఉన్నారు.
ఆ ఇద్దరు నేతలు చొరవ తీసుకోవడం లేదా?
కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి , జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ చొరవతీసుకొక పొవడంతోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేయడంలేదనే విమర్శలు వస్తున్నాయి. నర్సాపూర్ పార్టీ బలోపేతం కోసం ఇప్పటికైనా అధిష్ఠానం జోక్యం చేసుకోని నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేయాలని క్యాడర్ కోరుతున్నది.

