కలం, కరీంనగర్ బ్యూరో: పచ్చదనం , పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని.. గ్రామ సభలతో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra ) పేర్కొన్నారు. శనివారం కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామసభ నిర్వహించారు. దీనికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారమవుతాయని కలెక్టర్ గ్రామస్తులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పైపులైన్ల మరమ్మత్తులు, నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటూ వర్షపు నీటిని సంరక్షించాలన్నారు.
పచ్చదనం, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం వంటి వంటి చిన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన గ్రామాలే జాతీయస్థాయిలో అవార్డులు సాధిస్తున్నాయని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు , వసతులను సద్వినియోగం చేసుకొని సుస్థిర అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. నిబంధనల మేరకు చెత్త నిర్వహణ చేపట్టాలన్న కలెక్టర్.. అవెన్యూ ప్లాంటేషన్, బడిబాట గురించి వివరించారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలని కార్యదర్శిని ఆదేశించారు. ఇన్చార్జి ఆర్డీవో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సర్ లో భాగంగా ఓటరు నమోదు జాబితా, మ్యాపింగ్ ప్రక్రియ గురించి వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ ఆనందం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

