కలం, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి.. లే అవుట్లకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన లేఅవుట్ కమిటీ సమావేశంలో ఆమె కీలక సూచనలు చేశారు. పంచాయతీరాజ్, విద్యుత్, టౌన్ ప్లానింగ్, ల్యాండ్స్ అండ్ సర్వే, నీటిపారుదల శాఖల అధికారులతో కలిసి జరిగిన ఈ సమావేశంలో లేఅవుట్ అనుమతులపై సమగ్రంగా చర్చించారు. జిల్లాలో లేఅవుట్ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో సైట్ విజిట్‌లు నిర్వహిస్తూ లేఅవుట్ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా లైటింగ్, అప్రోచ్ రోడ్లు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని లేఅవుట్ కమిటీ సభ్యులకు ఆదేశించారు. జీవో నెంబర్ 105పై దరఖాస్తుదారులకు పూర్తి అవగాహన కల్పించాలని, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. అవసరమైతే సంయుక్త సర్వేలు నిర్వహించాలని కూడా సూచించారు.
ఈ సందర్భంగా రెండు రకాల లేఅవుట్లు డ్రాఫ్ట్, ఫైనల్ గురించి వివరించారు. డ్రాఫ్ట్ లేఅవుట్‌కు, ఫైనల్ లేఅవుట్‌కు మధ్య రెండేళ్ల వ్యవధి ఉంటుందని తెలిపారు. డ్రాఫ్ట్ లేఅవుట్‌లో ఆమోదించిన సౌకర్యాలను ఫైనల్ లేఅవుట్‌లో అమలు చేయకపోతే డెవలపర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పది ఎకరాల వరకు ఉన్న లేఅవుట్‌లకు కలెక్టర్ (Collector Chitra Mishra) అనుమతులు మంజూరు చేస్తారని, అంతకు మించి ఉన్న లేఅవుట్‌లకు హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అనుమతులు అవసరమని అధికారులు వివరించారు. అంతకుముందు లేఅవుట్ నిబంధనలు, దరఖాస్తు విధానం వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీటీసీవో ఆంజనేయులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Also: సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

