కలం, వెబ్ డెస్క్: తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికే వచ్చేలా చేసి, ఆ సంస్థను ఆదుకున్నానని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, ఈ ప్రాంత బిడ్డగా సింగరేణి బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నట్లు వివరించారు. తాడిచెర్ల గని తమకు కేటాయించాలని పలు రాష్ట్రాలు తనకు వినతిపత్రాలు సమర్పించాయని గుర్తు చేశారు.
తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా..
తాడిచెర్ల గని తెలంగాణ ఇంధన భద్రతకు సుదీర్ఘ భరోసాగా ఉండబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణికి అతి పెద్ద మైనింగ్ రిజర్వుగా మారబోతుందని.. అక్కడ సుమారు 434 మిలియన్ టన్నుల నిల్వలున్నాయని చెప్పారు. తద్వారా కొత్తగా మరో మూడు వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. అక్కడ అత్యుత్తమమైన 8, 9వ గ్రేడ్ బొగ్గు లభించనుందన్నారు.
ఇప్పటికే తెలంగాణ జెన్ కోకు ఒడిశాలోని నైనీ బ్లాక్ దక్కేలా చేశామని వివరించారు. ఈ రెండు బ్లాక్‌ల కారణంగా సింగరేణికి రూ.2.25 లక్షల టర్నోవర్ ఉంటుందన్నారు.
రాజకీయాలు చేయొద్దు..
తాడిచెర్ల గని తమ కృషి ఫలితమేనని భట్టి విక్రమార్క చెప్పడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాను కార్మికులతో కలిసి ఉద్యమాలు చేసిన వ్యక్తిని అన్నారు. సింగరేణి కార్మికులకు రూ.54 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, డిప్యూటీ సీఎం వాటిని క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తాడిచెర్ల గనిపై రాజకీయాలు చేయడం ఆపాలని సూచించారు.

