Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఫాబ్ ఫోర్’‌లో తొలి వికెట్.. 16 ఏండ్లుగా అద్భుత రికార్డులు

కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్ క్రికెట్ (New Zealand Cricket) ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. కివీస్ మాజీ కెప్టెన్, ఆధునిక క్రికెట్ ను శాసించిన ‘ఫాబ్ ఫోర్’లో ఒకరైన కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ క్రికెట్ కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ జరుగుతుండగానే ఆయన ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం క్రీడాలోకాన్ని ఆశ్చర్యపరిచింది. గత 16 ఏండ్లుగా కివీస్ జట్టుకు వెన్నెముకలా నిలిచిన 35 ఏండ్ల విలియమ్సన్.. ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను అందుకున్నాడు.

కివీస్‌ తరఫున 110 టెస్టులు, 175 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (19,346) చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో 9,515 పరుగులతో కివీస్ జట్టులోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లు కలిపి మొత్తం 48 సెంచరీలు సాధించాడు. గతేడాది నవంబర్ లోనే టీ20లకు విలియమ్సన్ గుడ్ బై చెప్పాడు. ఆ ఫార్మాట్ లో 2,575 పరుగులతో దేశంలోనే రెండో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.

తిరుగులేని కూల్ కెప్టెన్..

విలియమ్సన్ కేవలం ‘ఫాబ్ ఫోర్’ క్లాస్ బ్యాటర్ మాత్రమే కాదు. మైదానంలో ఎప్పుడూ కూల్ గా ఉంటూ, అందరినీ గౌరవిస్తూ జట్టును నడిపించిన అద్భుతమైన లీడర్. ఆయన 2016 నుంచి 2024 వరకు మూడు ఫార్మాట్లలో న్యూజిలాండ్ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఆయన సారథ్యంలో కివీస్ జట్టు స్వర్ణయుగాన్ని చూసింది. రెండు వన్డే ప్రపంచకప్ ఫైనల్స్, మూడు సెమీఫైనల్స్ చేరడంతో పాటు, 2021లో జరిగిన తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.

నిరాశ పరిచిన చివరి మ్యాచ్

ఇటీవల ఇంగ్లండ్తో లార్డ్స్ మైదానంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ విలియమ్సన్ కు చివరిదిగా మిగిలిపోయింది. ఆ లో-స్కోరింగ్ మ్యాచ్ లో ఆయన 0, 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. వచ్చే వారం బుధవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ ను ఆయన అందుబాటులో ఉండరు. ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనేది సెలెక్టర్లు ఇంకా ప్రకటించలేదు.

‘కేన్ మామ’కూ తెలుగు ఫ్యాన్స్..

కేన్ కేవలం న్యూజిలాండ్ ప్లేయర్ మాత్రమే కాదు.. తెలుగు క్రికెట్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్రికెటర్. 2018లో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆయన కెప్టెన్ గా వ్యవహరించి, జట్టును ముందుండి నడిపించాడు. ఆయన లీడర్షిప్ లోనే హైదరాబాద్ టీమ్ ఫైనల్స్ చేరింది. 2016లో ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడినప్పుడు కూడా ఆయన ఆ విజేత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. మైదానంలో ఆయన చూపించే ప్రశాంతతకు, చిరునవ్వుకు ఫిదా అయిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఆయన్ను ముద్దుగా ‘కేన్ మామ’ అని పిలుచుకున్నారు. ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 79 మ్యాచ్‌లు ఆడిన కేన్.. 2,128 పరుగులు సాధించారు.


న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘కేన్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఒక అదృష్టం. ఆయన రికార్డులు, బ్యాటింగ్ నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్ లో, ప్రపంచ క్రికెట్ లో ఆయన వదిలివెళ్తున్న వారసత్వం చాలా గొప్పది. క్రికెట్ కు కేన్ (Kane Williamson) ఒక గొప్ప అంబాసిడర్.’ అని కొనియాడారు.

ఏంటీ ‘ఫాబ్ ఫోర్’?

ప్రపంచ క్రికెట్ లో ఒకే కాలానికి చెందిన నలుగురు అత్యుత్తమ క్లాస్ బ్యాటర్లను అభిమానులు, విశ్లేషకులు ముద్దుగా ‘ఫాబ్ ఫోర్’ (ఫ్యాబులస్ ఫోర్) అని పిలుస్తారు. దశాబ్ద కాలంగా తమ అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో పరుగుల వరద పారిస్తూ, ప్రపంచ క్రికెట్పై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన నలుగురు ఆటగాళ్లు వీరే:
– విరాట్ కోహ్లీ (భారత్)
– స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
– జో రూట్ (ఇంగ్లాండ్)
– కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)
– ఒకరి రికార్డులను మరొకరు బద్దలు కొడుతూ సాగిన ఈ నలుగురి పోటీలో.. ఇప్పుడు విలియమ్సన్ రిటైర్మెంట్ లో ‘ఫాబ్ ఫోర్’ యుగంలో మొదటి వికెట్ పడినట్లయింది.

Read Also: కేన్ విలియమ్సన్‌ రిటైర్మెంట్.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>