కలం, నల్లగొండ బ్యూరో: విద్య వ్యాపారం అయిపోయింది. ఇంటర్మీడియట్ విద్య ఎంతో ఖరీదుగా మారిపోయింది. ప్రముఖ విద్యాసంస్థలు తమ బ్రాండ్ ను అడ్డం పెట్టుకొని భారీ దందాకు తెరలేపాయి. నగరాల్లోనే కాదు జిల్లాల్లోనూ ఈ దందా జోరుగా సాగుతోంది. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్ముంతా కార్పొరేట్ విద్యాసంస్థల (Corporate Colleges)కు ధారపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలానా కాలేజీలో చదివితేనే ఐఐటీ, నీట్, జేఈఈ, ఎప్ సెట్ లాంటి కోచింగ్ బాగా అందుతున్న ప్రచారంతో తల్లిదండ్రులు బ్రాండ్ పేరు ఉన్న కార్పొరెట్ విద్యాసంస్థలకు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా విద్యాసంస్థలు దందా చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని తమ పిల్లలను చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్కారు కాలేజీల్లో కోచింగ్ లు ఉండవు. కనీసం సిలబస్ అయినా చెబుతారో లేదో తెలియని స్థితి. విద్యార్థుల మీద పర్యవేక్షణ కరువైంది. కార్పొరెట్ సంస్థలు ఈ అవకాశాన్ని వాడుకొని విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి.
నల్లగొండ జిల్లాల్లో ఇదీ పరిస్థితి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీల ఫీజుల దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. బ్రాండ్ పేరుతో బడా కార్పొరేట్ కాలేజీలు (Corporate Colleges) జిల్లా కేంద్రాల్లోకి చొచ్చుకుని రావడానికి తోడు స్థానికంగా ఆర్థికంగా బలంగా ఉన్న విద్యా సంస్థలు మాత్రమే ఇంటర్ కాలేజీలను నడిపే పరిస్థితి ఏర్పడింది. పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోని సాధారణ ఇంటర్మీడియట్ కాలేజీలు దాదాపుగా తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో ఆర్థిక బలం ఉన్నా.. యాజమాన్యాలు మాత్రమే ఇంటర్ కాలేజీలు కొనసాగిస్తున్నాయి. తల్లిదండ్రులు అప్పుచేసి మరీ విద్యార్థులను హాస్టల్ వసతితో ఉన్న ఇంటర్ కాలేజీల్లో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆ కాలేజీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఫలితంగా ప్రైవేటు మోజులో పడి విద్యార్థుల తల్లిదండ్రులు రూ.లక్షలు సమర్పించుకుంటుండడం గమనార్హం.
మాములు ప్రైవేటు కాలేజీలు భారీగా మూసివేత..
గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులతో పాటు చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లోని విద్యార్థులు చదివితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివేటోళ్లు. కానీ కరోనా ఎఫెక్ట్‌కు తోడు ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్‌తో కూడిన ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లోనే చదివించేందుకు మొగ్గు చూపుతుండడం వల్ల చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రైవేటు ఇంటర్ కాలేజీలు మొత్తం మూతపడ్డాయి. దీంతో బ్రాండ్ పేరుతో ఉన్న కార్పొరేట్ కాలేజీల బాటపట్టడం పరిపాటిగా మారింది. నకిరేకల్, కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ తదితర ప్రాంతాల్లోని మాములు ఇంటర్ ప్రైవేటు కాలేజీలు భారీగా మూతపడ్డాయి. ఒక్క నకిరేకల్‌లోనే నాలుగు ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటే.. నాలుగు కాలేజీలు క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇటు ప్రభుత్వ కాలేజీల్లో తమ పిల్లలను ఇంటర్ చదివించలేక.. అటు కార్పొరేట్ కాలేజీల్లోకి పంపలేక.. జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో చదివించేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపుతున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేటు ఇంటర్ కాలేజీలు అడ్డగోలు ఫీజుల దోపిడీకి తేరలేపాయి.
ఇంటర్ ఒక్క ఏడాదికి రూ.1.25 లక్షలు..
నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని కొన్ని ప్రైవేటు ఇంటర్ కాలేజీలు అడ్డగోలు ఫీజుల దందాకు తేరలేపాయి. రెసిడెన్షియల్ పేరుతో ఒక్కో ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.1.25 లక్షలకు పైగా వసూలు చేస్తుండడం గమనార్హం. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలకు కలిపి అక్షరాల రూ.2.50 లక్షలకు పైనే వసూలు చేస్తున్నారు. ఇంటర్‌కు ఎంబీబీఎస్ ఫీజులను తలదన్నేలా వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తే.. ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతూ డబ్బులు దండుకుంటున్నారు. ఫీజులను పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం.. అసలు జిల్లాల్లో ఉందో.. లేదో తెలియని పరిస్థితి. ఎవరైనా తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే గానీ అసలు ఆ విషయమే పట్టించుకోవడం లేదు. నల్లగొండ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులోని ఓ ప్రైవేటు కాలేజీ ఒకే పర్మిషన్ పేరుతో నాలుగైదు బ్రాంచ్‌లను ఓపెన్ చేసింది. స్పార్క్, ఎపెసెట్ అంటూ కొత్త కొత్త పేర్లు పెట్టి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది చాలదన్నట్టు.. అదనంగా పుస్తకాలు, నోట్‌బుక్‌లను సైతం అదే కాలేజీ ప్రాంగంణంలో విక్రయిస్తూ కొత్త దుకాణాలను తెరవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. ఇంటర్మీడియట్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆఖరికి జిల్లా కలెక్టర్ సైతం నిత్యం అటుగానే రాకపోకలు సాగిస్తూ తనకేం పట్టనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇంటర్ కాలేజీలపై కన్నేయాల్సిన అవసరం ఉంది.

