కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లపై తీవ్ర చర్చ జరుగుతున్నది. అవి పెద్ద మొత్తంలో వినియోగిస్తున్న విద్యుత్, నీళ్లపై ఆందోళన వ్యక్తమవుతున్నది. డేటా సెంటర్లు (Data Center) వినియోగిస్తున్న నీళ్ల లెక్కలను విడుదల చేయాలనే డిమాండ్ అమెరికాలో ఊపందుకున్నది. ఈ తరుణంలో డేటా సెంటర్లలో నీళ్ల వినియోగానికి సంబంధించి అమెజాన్ డేటా రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్ల నిర్వహణ కోసం 2025 సంవత్సరంలో మొత్తం 900 కోట్లకు పైగా లీటర్ల నీటిని వినియోగించినట్టు వెల్లడించింది.
తప్పుడు లెక్కలనే విమర్శలు
900 కోట్ల లీటర్ల నీళ్లు అంటే పెద్ద మొత్తంలో అనిపించినప్పటికీ, తమ డేటా సెంటర్ల పరిధితో పోలిస్తే ఆ వినియోగం తక్కువేనని అమెజాన్ పేర్కొంది. 2024తో పోలిస్తే 2025లో నీటి వినియోగం 2 శాతం మేర తగ్గిందని తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా కంపెనీలతో పోలిస్తే తమ డేటా సెంటర్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయని చెప్పింది. 2025లో ఒక కిలోవాట్-అవర్ విద్యుత్ వినియోగానికి అమెజాన్ డేటా సెంటర్లు (Amazon Data Center) కేవలం 0.12 లీటర్ల నీటిని మాత్రమే ఉపయోగించాయని వెల్లడించింది. ఇందుకు సంబంధించి చార్ట్ విడుదల చేసింది. అయితే అమెజాన్ చూపించిన గణాంకాలు దాని మొత్తం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినవి కాగా.. గూగుల్ గణాంకాలు కేవలం ‘జెమిని ఏఐ’ డేటా సెంటర్లకు మాత్రమే సంబంధించినవని నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా హై-ఎండ్ జీపీయూలను వాడే ఏఐ డేటా సెంటర్లకు ఎక్కువ నీరు అవసరమవుతుంది. అలాగే కొత్త డేటా సెంటర్ల నిర్మాణానికి వాడే నీటిని, వీటికి విద్యుత్ అందించే పవర్ ప్లాంట్లలో ఖర్చయ్యే నీటిని అమెజాన్ ఈ లెక్కల్లో చేర్చలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కాగా, ప్రస్తుతం అమెజాన్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 924 డేటా సెంటర్లు ఉన్నాయి.
సమాజానికి తిరిగి ఇస్తాం..
2030 నాటికి డేటా సెంటర్లలో ఉపయోగించే ప్రతి గ్యాలన్ నీటి కంటే ఎక్కువ మొత్తంలో నీటిని తిరిగి సమాజానికి అందిస్తామని అమెజాన్ తెలిపింది. ఇప్పటికే ఈ లక్ష్యంలో 75 శాతాన్ని చేరుకున్నట్లు పేర్కొంది. నీటిని వృథాను అరికట్టడానికి ఇప్పటికే 26 ప్రాంతాల్లో 100 శాతం రీసైకిల్ చేసిన నీటిని వాడుతున్నామని, ప్రపంచవ్యాప్తంగా మరో 130 కేంద్రాల కోసం ఒప్పందాలు చేసుకున్నామని తెలిపింది. డేటా సెంటర్లను చల్లబరచడానికి 90 శాతం గాలినే వాడుతామని, ఎండలు ఎక్కువగా ఉండే రోజుల్లో మాత్రమే నీటి ఆధారిత ‘ఇవాపరేటివ్ కూలింగ్’ పద్ధతిని ఉపయోగిస్తామని పేర్కొంది.
ఎందుకు ఇన్ని నీళ్లు?
డేటా సెంటర్ల నిర్వహణకు భారీ మొత్తంలో నీళ్లు అవసరమవుతాయి. మనం ఇంటర్నెట్‌లో చూసే వీడియోలు, సోషల్ మీడియా, క్లౌడ్ స్టోరేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివన్నీ రన్ అవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది శక్తివంతమైన కంప్యూటర్లు (సర్వర్లు) రాత్రింబవళ్లు పని చేస్తూనే ఉండాలి.
– వేలాది సర్వర్లు ఒకేచోట నిరంతరం పనిచేయడం వల్ల విపరీతమైన వేడి పుడుతుంది. సర్వర్లు ఎక్కువ వేడెక్కితే అవి పాడైపోతాయి లేదా క్రాష్ అవుతాయి. ఈ వేడిని తగ్గించడానికి డేటా సెంటర్లలో ‘ఇవాపరేటివ్ కూలింగ్’ పద్ధతిని వాడుతుంటారు. ఇందులో వేడి గాలిని చల్లబరచడానికి నీటిని ఆవిరి చేస్తారు. ఈ ప్రక్రియలో ప్రతిరోజూ లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది.
– డేటా సెంటర్లు నడవడానికి భారీగా విద్యుత్ అవసరం. ఈ విద్యుత్‌ను తయారు చేసే పవర్ ప్లాంట్లలో కూలింగ్ కోసం, టర్బైన్లు తిప్పడం కోసం గ్యాలన్ల కొద్దీ నీటిని ఉపయోగిస్తారు.

