కలం, ఖమ్మం బ్యూరో: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam)లో ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవంతో పాటు, నిత్య పూజా కార్యక్రమాలను మిథిలా ప్రాంగణంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సోమవారం అర్చకులు తెలిపారు. శ్రీరామనవమి కళ్యాణ మండపానికి ఎదురుగా భక్తుల సౌలభ్యం కోసం దేవస్థానం వారు ప్రత్యేకంగా ఒక నూతన షెడ్డును ఏర్పాటు చేశారని, ఇక్కడ ప్రతిరోజూ స్వామివారి నిత్యకళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరుగుతోందని వెల్లడించారు.
పవిత్రమైన ఈ మిథిలా ప్రాంగణంలో శ్రీరామచంద్రమూర్తి నిత్యకళ్యాణం జరిపించుకోవడం ఎంతో విశేషమైన పుణ్యఫలమని భక్తుల విశ్వాసం. లోకానికి ఆదర్శ దంపతులైన సీతారాముల నిత్యకళ్యాణాన్ని దర్శించి, స్వామివారిని ప్రార్థించడం ద్వారా సకల సౌఖ్యాలు, భోగభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని అర్చకులు పేర్కొన్నారు. భద్రాచలానికి తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దేవస్థానం వారు నిత్యకళ్యాణాలతో పాటు శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణాన్ని కూడా వీక్షించేలా చక్కటి వసతులు కల్పించారు. కావున భక్తులంతా భారీ సంఖ్యలో తరలివచ్చి, నిత్యకళ్యాణ మహోత్సవాన్ని సేవించి సీతారాముల దివ్య దంపతుల కృపను పొందవలసిందిగా కోరారు.

