కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో మద్యం దుకాణాల మూసివేతపై స్పందించిన కమల్ హాసన్ (Kamal Haasan).. ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు. దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్ల సమీపంలోని మద్యం దుకాణాలను తొలగించాలని తమిళ కుటుంబాలు చాలా కాలంగా కోరుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం విజయ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకోవడం అభినందనీయమని కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ప్రభుత్వం మద్యం అమ్మకాల నిర్వహణలో భాగం కాకూడదని, కేవలం మద్యం ప్రవాహాన్ని నియంత్రించే బాధ్యత మాత్రమే తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ప్రస్తుతం 717 మద్యం దుకాణాలను మూసివేయడం మంచి ప్రారంభమని అన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచాలని, ఇలాంటి చర్యలు కొనసాగించాలని సూచించారు. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి కమల్ హాసన్ అభినందనలు తెలిపారు.

