కలం, వెబ్ డెస్క్: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మద్దతు ప్రకటించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు నమోదు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదే జరిగితే, హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ విశ్లేషణలు చేసే నాగేశ్వర్‌పై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు ఎంతగానో గౌరవించే మేధావి, ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కవిత తెలిపారు.
విశ్లేషణలతో ఏకీభవించకపోతే..
ప్రొఫెసర్ నాగేశ్వర్ (Professor Nageshwar) విశ్లేషణలతో ఏకీభవించకపోతే ఖండించాలే తప్ప ఇలా కేసులు పెట్టడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కవిత (Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కూడా ఆయన చేసిన విశ్లేషణలను వ్యక్తిగతంగా విభేదించానని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన “భావప్రకటన స్వేచ్ఛ”ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని, దాన్ని మానుకోవాలని సూచించారు.
Read Also: జగిత్యాల కాంగ్రెస్ నిరసనలో ఆర్టీసీ డ్రైవర్ ఝలక్
Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

