కలం, వెబ్ డెస్క్: పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని సుప్రీంకోర్ట్ సాక్షిగా మరోసారి తేలిపోయిందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. ముఖ్యమంత్రికి నీళ్ల సోయి లేదని విమర్శించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఈ రోజు సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు చూస్తే.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంతలా సహకరిస్తున్నారో అర్థమవుతోందన్నారు.
కనీసం పిటిషన్ కూడా వేయలేరా..?
ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం – బనకచర్ల లింక్ అక్రమ ప్రాజెక్ట్ అని.. దాన్ని అడ్డుకోవడానికి కనీసం బలమైన పిటిషన్ కూడా వేయలేరా.. అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఏపీ సీఎంతో రేవంత్ రెడ్డి ములాఖత్ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నారో ఇక్కడే తెలిసిపోతుందన్నారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై కనీసం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇవ్వడానికి సుప్రీంకోర్ట్ నిరాకరించిందని.. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ లోపాలమయంగా ఉందని కోర్ట్ పేర్కొందన్నారు. అందుకే, కనీసం ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పిందన్నారు.
గోదావరి నీళ్లను రాసిస్తున్న రేవంత్..
తెలంగాణ సీఎంగా రాష్ట్ర హక్కులు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు గురు దక్షిణగా గోదావరి నీళ్లను ఏపీకి రాసిస్తున్నారని కవిత మండిపడ్డారు. పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోలేకపోతే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. ఎలాంటి లోపాలు లేకుండా.. పటిష్టమైన పిటిషన్ మరోసారి దాఖలు చేయాలని సూచించారు.

