కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula) పేర్కొన్నారు. సోమవారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ పనుల పురోగతి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్ పనులు, అలాగే రైతుల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన నూతన సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని ఎమ్మెల్యే బత్తుల (MLA Bathula) అధికారులను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో రైతులకు బావులు, బోర్లలో నీటి శాతం తగ్గకుండా ఉంటుందని ఆయన సూచించారు. ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష అనంతరం ఇరిగేషన్ అధికారులతో కలిసి నియోజకవర్గ పరిధిలో రూ.11 కోట్లతో చేపట్టిన ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ మరమ్మతులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేసిన ఆయన, ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కాలువ మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చూడాలన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి రైతుకు సాగునీటి సౌకర్యం మెరుగుపడేలా నిరంతరం అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్.సి మల్లికార్జున రావు, ఈఈ గోపినాథ్, ఈఈ మనోహర్, డీఈలు, జేఈలు, ఏఈలు పాల్గొన్నారు.

