కలం, ఖమ్మం బ్యూరో: భక్తిని అడ్డం పెట్టుకుని, పవిత్ర దేవాలయాల్లోని హుండీలనే లక్ష్యంగా చేసుకున్న ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు కల్లూరు (Kalluru) పోలీసులు. రాత్రివేళల్లో రెక్కీలు నిర్వహిస్తూ, వరుస దొంగతనాలతో రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలను వణికించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
బుధవారం రాత్రి కల్లూరు (Kalluru) ఎస్సై హరిత తన సిబ్బందితో కలిసి మధిర రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. రెండు బైక్‌లపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి యూ-టర్న్ తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సినిమా ఫక్కీలో వారిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వారి వివరాలపై అనుమానం రావడంతో, పోలీసులు అత్యాధునిక డివైస్ ద్వారా వారి వేలిముద్రలను తనిఖీ చేశారు. క్షణాల్లో పోలీసు డేటాబేస్ నిందితుల జాతకాన్ని బయటపెట్టింది. వారిలో ఇద్దరు పాత నేరస్తులని తేలడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితులు బోలుసు ఏసుబాబు, చేవూరి ఆదినారాయణ, తుమ్మల మురళి కలిసి గత ఆరు నెలలుగా కల్లూరు, తల్లాడ, మధిర, పెనుబల్లి మండలాలతో పాటు ఏపీలోని విస్సనపేట ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పతున్నట్లు వెల్లడైంది. వీరు ప్రధానంగా దేవాలయాల హుండీలు, కిరాణా షాపులు, చివరకు పోస్ట్ ఆఫీసులను కూడా వదలకుండా చోరీలకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారి వద్ద నుండి దొంగతనాలకు వాడే గడ్డపారతో పాటు, రెండు మోటార్ సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి ముఠాను పట్టుకున్న ఎస్సై డి. హరిత, హెడ్ కానిస్టేబుళ్లు నాగేంద్ర బాబు, సత్యనారాయణ, నరసింహారావులను ఏసీపీ అభినందించారు. గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలకు ఏసీపీ విజ్ఞప్తి చేశారు.
Read Also: నల్లగొండ గులాబీ కోటలో హరీశ్ సీక్రెట్ ఆపరేషన్..
Follow Us On: Sharechat

