Mobile Popup Ad
Mobile Popup Ad

కాళేశ్వరంపై CBIలో కదలిక.. విచారణకు కేసీఆర్, హరీశ్‌రావు?

కలం, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో అవినీతి, అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేపట్టేందుకు కసరత్తు మొదలైంది. దర్యాప్తు చేపట్టడానికి ముందు అవసరమైన సన్నాహాలపై సీబీఐ డైరెక్టర్ సహా పలువురు సీనియర్ ఆఫీసర్లు చర్చించారు. టెక్నికల్, మెకానికల్, ఫైనాన్షియల్ అంశాల్లో అధ్యయనాన్ని ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులో లేఖరాసింది. ఇప్పటివరకు దానిపై కదలిక లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Pinaki Chandra Ghose) నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్ కేసీఆర్, హరీశ్‌రావు మొదలు పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లను విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసి ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించింది. ఈ అంశాన్ని అసెంబ్లీలో సైతం చర్చించి సీబీఐ దర్యాప్తు కోరుతూ తీర్మానం ఆమోదం పొందింది.

సీబీఐకి వివరాలిచ్చిన రాష్ట్ర అధికారులు :

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు దర్యాప్తు జరపడానికి సీబీఐ (CBI) దాదాపుగా పాజిటివ్ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే రాష్ట్ర సర్కార్ పంపిన డాక్యుమెంట్లన్నింటినీ లోతుగా స్టడీ చేసింది. కొన్ని అంశాల్లో మరింత వివరణ అవసరమని భావించి ఇటీవలే రాష్ట్ర హోంశాఖకు లేఖ రాసింది. దానికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం ఇటీవలే ఢిల్లీ వెళ్ళి క్లారిఫికేషన్ ఇచ్చింది. వాటిపై సీబీఐ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దర్యాప్తు మొదలుపెట్టడానికి అవసరమైన సన్నాహాలన్నీ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఏ రోజైనా దర్యాప్తు చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా సమాచారం పంపే అవకాశమున్నది. ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక వెల్లడించడంతో ఆ కోణం నుంచి సీబీఐ దర్యాప్తు జరగనున్నది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు జస్టిస్ ఘోష్ తన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

కేసీఆర్, హరీశ్‌రావుపై చర్యల్లేకుండా హైకోర్టు స్టే :

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో అవినీతి, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే కేసీఆర్‌ను, హరీశ్‌రావును విచారించారు. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ప్రాజెక్టులో ఎక్కడెక్కడ అవినీతి, అవకతవకలు జరిగాయో, వాటిపై కేసీఆర్ (KCr), హరీశ్‌రావు (Harish Rao) ఇచ్చిన వివరణ ఏంటో పేర్కొన్నారు. ఈ నివేదికను ప్రభుత్వం యధాతథంగా ఆమోదించింది. మూడు బ్యారేజీలు డ్యామేజ్ కావడం, దానికి దారితీసిన కారణాలు, డిజైన్లలో లోపాలు, నిధుల మళ్లింపు, నిబంధనల ఉల్లంఘన.. వీటన్నింటినీ ప్రస్తావించి సీబీఐ దర్యాప్తు అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా వెల్లడించింది. ఇదే సమయంలో ఈ నివేదిక మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు సహా పలువురు పిటిషన్లు వేశారు. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

సీబీఐ విచారణకు కేసీఆర్, హరీశ్‌రావు? :

త్వరలో సీబీఐ తన దర్యాప్తును మొదలుపెడితే మరోసారి KCR, హరీశ్‌రావు సహా ఆ ప్రాజెక్టు నిర్మాణంతో సబంధమున్న ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లను విచారించే అవకాశమున్నది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలోని అంశాలకు అనుగుణంగా తదుపరి విచారణతో సీబీఐ తనకు అవసరమైన వివరాలను వీరి నుంచి రాబట్టే అవకాశమున్నది. ఒకవైపు హైకోర్టులో కేసు విచారణ దశలో ఉండగా సీబీఐ తన దర్యాప్తును ఏ విధంగా ప్రారంభించి కొనసాగిస్తుందనేది కీలకంగా మారింది. ఇంకోవైపు సీబీఐ దర్యాప్తు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నందున త్వరలో సీబీఐ నుంచి ఈ దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడుతుందనేది కూడా ఆసక్తికరం. ఇప్పటికే రెండున్నరేళ్ల సమయం పట్టడంతో సీబీఐ దర్యాప్తు ఎంతకాలం సాగుతుంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏం జరగనున్నదనే అంచనాలూ నెలకొన్నాయి.

Read Also: గ్యాస్ లేకుండా వంట చేసుకోవచ్చు.. సరికొత్త స్టవ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>