కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో (Kakatiya University) కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కే –హబ్ (K Hub) అలంకారప్రాయంగా మారింది. ముగ్గురు మంత్రులు, అయిదుగురు ఎమ్మెల్యేలు అట్టహాసంగా రెండేళ్ల కిందట రూ.15 కోట్లతో కేయూ హబ్ ప్రారంభించగా.. ఇప్పటికీ తాళాలు తీయడం లేదు. రీసెర్చ్ కు అవసరమైన పక్కా బిల్డింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్షర్, ఇతర ఎక్విప్మెంట్ తో నిర్మాణం చేసినా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణల వైపు అడుగులు పడటం లేదు. ఈ నేపథ్యంలో ‘కే–హబ్’ భవనం నిరుపయోగంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరంభ శూరత్వమే..
తెలంగాణ రాష్ట్రంలో రెండో అతి పెద్ది విశ్వవిద్యాలయంగా కేయూకి పేరుంది. ఎంతో ఘన కీర్తి కలిగిన ఈ యూనివర్సిటీలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద ‘కే –హబ్’ (K Hub)ను మంజూరు చేసింది. రీసెర్చ్, ఇన్నోవేషన్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం ‘కె–హబ్’ నిర్మాణానికి దాదాపు రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో ‘కే–హబ్’కు భవనంతో పాటుగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2020 లోనే రూసా కింద రూ.16 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.6 కోట్లతో ‘కె–హబ్’ బిల్డింగ్ నిర్మాణం చేశారు.
పాలకుల నిర్లక్ష్యమే కారణం..
గత పాలకులు పట్టించుకోకపోవడం, విద్యార్థులు పరిశోధనలకు దూరమవుతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కే –హబ్ పై ప్రత్యేక దృష్టి సారించింది. బిల్డింగ్ నిర్మాణం, శానిటరీ వర్క్స్, వాటర్ సప్లై, ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి చేశారు. 2024 మార్చి 10న కేయూలో కే–హబ్ ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. కానీ ఇప్పటికీ పరిశోధనలకు నోచుకోలేదు.
వేసిన తాళాలు వేసినట్లే…
కే–హబ్ ప్రారంభించిన రోజు గదులకు తాళాలు వేసిన అధికారులు నేటికీ తీయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా భవనం లోపల గోడలు తొలగించి మళ్లీ నిర్మాణాలు చేపడుతున్న తీరుపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరిశోధనా కేంద్రంగా నిలవాల్సిన కే –హబ్ నిరుపయోగంగా మార్చారని కేయూ రీసర్చ్ స్కాలర్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కేయూ అధికారులు స్పందించి కే –హబ్ లో పరిశోధనలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. ఖర్గేకు నోటీసులు
Follow Us On: Sharechat

