పౌరసరఫరాల శాఖలో ‘సన్న’ మాయాజాలం?.. కాచం శ్రీనివాస్ ఫిర్యాదు!

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి తిష్టవేసిందా? పేదలకు అందాల్సిన సన్న బియ్యం దారిమళ్లుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) పేరుతో ఉమ్మడి ఉమ్మడి జిల్లాల్లో అధికారుల అండదండలతో మిల్లర్లు సాగిస్తున్న ‘సన్న’ మాయాజాలం వల్ల పౌరసరఫరాల సంస్థకు రూ. 300 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని సమాచారం.

సీఎం రేవంత్ కు మెయిల్ ద్వారా కాచం శ్రీనివాస్ ఫిర్యాదు

ఈ భారీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కు చెందిన సామాజిక కార్యకర్త కాచం శ్రీనివాస్ (Kacham Srinivas) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

​రైతుకు ప్రోత్సాహం.. మిల్లర్లకు ‘పండగ’!

​రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలనే సదుద్దేశంతో, రైతులను ప్రోత్సహించేందుకు సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తోంది. ప్రభుత్వ ఆశయం బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఈ పథకాన్ని తమ స్వలాభానికి వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

​అక్రమాల నెట్‌వర్క్ ఇలా..
​కామన్ గ్రేడ్‌గా కన్వర్షన్

పౌరసరఫరాల శాఖ సేకరించిన నాణ్యమైన సన్న రకం ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తే, వారు దానిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లెక్కల్లో దొడ్డు రకం (కామన్ గ్రేడ్)గా మార్చి చూపిస్తున్నారు. ​బహిరంగ మార్కెట్లో రూ. 3,500కి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సన్న ధాన్యాన్ని(వడ్లు) బయట మార్కెట్లో క్వింటాలు రూ. 3,500 వరకు అమ్ముకుంటూ మిల్లర్లు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

​పక్క రాష్ట్రాల నుంచి చౌక బియ్యం

ప్రభుత్వం, FCI కి ఇవ్వాల్సిన కోటా కోసం పొరుగు రాష్ట్రాల నుంచి అతి తక్కువ ధరకు లభించే దొడ్డు/మీడియం రకం బియ్యాన్ని కొనుగోలు చేసి డిపాజిట్ చేస్తున్నారన్నారు.

​లారీకి రూ. 2.17 లక్షల నష్టం

అధికారుల లెక్కల ప్రకారమే ఒక లారీ (ACK) ధాన్యానికి (435 క్వింటాళ్లకు) దాదాపు రూ. 2,17,500 వరకు ప్రభుత్వం నష్టపోతోందని వివరించారు. ఒక్కొక్క ఎఫ్‌సీఐ ఏరియాకి రూ. 15 లక్షల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్లు పక్కదారి పడుతున్నాయన్నారు.

​అధికారులు, మిల్లర్ల కుమ్మక్కుపై విచారణకు డిమాండ్!

​ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా కొందరు అధికారులు సిండికేట్‌గా మారి ఈ బ్లాక్‌మెయిల్ రాజకీయం నడుపుతున్నారని, కాచం శ్రీనివాస్ ఆరోపించారు. పౌరసరఫరాల శాఖను వెంటనే ప్రక్షాళన చేసి, విజిలెన్స్ లేదా అత్యున్నత స్థాయి కమిటీచే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>