కలం, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరోడా (Naroda Murder) ప్రాంతంలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. రాత్రి భోజన సమయంలో భార్య వండిన కూరను భర్త మెచ్చుకోకపోవడంతో భార్య, భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన భార్య నిర్మల, వంటగదిలోని కూరగాయలు కోసే కత్తితో భర్తపై దాడి చేసి గుండె భాగంలో తీవ్రంగా పొడిచింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
మృతుడిని భారత ఆర్మీ నుంచి రిటైర్ అయిన దిలీప్‌భాయ్ సోమాజీ ఖరాడీ గా పోలీసులు గుర్తించారు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన అనంతరం ఆయన జీఎండీసీ లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నరోడా పోలీసులు నిందితురాలైన భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ముందస్తు ప్రణాళికతో కాకుండా క్షణికావేశంలోనే జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితురాలని విచారిస్తున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

