ధరణి అక్రమాలపై సీఐడీ దూకుడు… మరో ఐదుగురు అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ కోసం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో (Dharani Scam) జరిగిన అక్రమాలు, రికార్డుల తారుమారు వ్యవహారంపై సీఐడీ అధికారులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది. సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 15 సీఐడీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిన్న 9 మంది ఆపరేటర్లను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు.. నేడు మరో 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటివరకు సుమారు 14 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా, సీఐడీ అధికారుల తనిఖీలలో ధరణి ఆపరేటర్లు, ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల ఇళ్లతో పాటు సాంకేతిక నిర్వహణ సంస్థలైన టెర్రాసిస్, క్వాంటెలా కార్యాలయాలపై దాడులు చేసి కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలోని రికార్డులపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో కీలకమైన డిజిటల్ ఫుట్‌ప్రింట్లు (డిజిటల్ ఆధారాలు) వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా లాగిన్ అయి భూ యాజమాన్య రికార్డులు, నిషేధిత జాబితా వివరాలను మార్చినట్లు సీఐడీ దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు.

ప్రతిపాదిత బ్లాక్‌చెయిన్ భద్రతా వ్యవస్థను అమలు చేయకపోవడం, వేలాదిగా వెలిసిన అనధికార లాగిన్లపై సీఐడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ల నుంచి ఆర్డీవోలు, కలెక్టర్ల వరకు రెవెన్యూ అధికారుల పాత్రపైనా విచారణ కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘించి భూములను బదిలీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ సన్నాహాలు చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>