డేంజర్ జోన్‌లో ‘జూరాల’. ఆందోళనలో ఆయకట్టు రైతాంగం!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణలో కృష్ణా నదిపై నిర్మించిన మొదటి ఆనకట్ట నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోతోంది. పాలమూరు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన జూరాల ప్రాజెక్ట్ (Jurala Project) ‘సిల్ట్’ కష్టాలు ఎదుర్కొంటోంది. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 11. 6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2. 294 టీఎంసీల నీరు తక్కువగా ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా వర్షాకాలంలో మట్టి, ఇసుకతోపాటు వరద వచ్చి చేరడంతో సిల్ట్ బాగా పేరుకుపోయినట్టు అధికారులు అంటున్నారు.

2 టీఎంసీలు తగ్గడంతో తీవ్ర ఎఫెక్ట్

జూరాల ప్రాజెక్టులో రెండు టీఎంసీల నీరు తగ్గడంతో దాదాపుగా లక్ష ఎకరాల సాగుపై ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పూడికపై గతంలో రెండు పర్యాయాలు వివిధ సర్వే సంస్థలతో సర్వే చేయించగా, రెండు టీఎంసీలపైగా పూడిక ఉన్నట్లు తేలింది. 2012లో టీఎస్ ఈఆర్ఎఫ్ సంస్థతో సర్వే చేయించగా 2.284 నీటి సామర్థ్యం తగ్గిందని అంచనా వేశారు. మళ్లీ పదేళ్లకు.. 2022లో ఆర్.వి అసోసియేట్ కంపెనీతో సర్వే చేయించగా 2. 294 సామర్థ్యం తగ్గినట్టు సర్వే రిపోర్టు ఇచ్చారు. దీంతో జూరాల నీటి నిలువ సామర్థ్యం 9. 647 టీఎంసీలుగా ఉందని తేల్చారు. జూరాల ప్రాజెక్టులో నీటి నిలువ తగ్గడంతో దాదాపు లక్ష ఎకరాల సాగుపై ఎఫెక్ట్ పడుతుంది.

ముందుకురాని గుత్తేదారులు

జూరాల ప్రాజెక్టులు సిల్ట్‌ను తీసేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం పేరుకుపోయిన సిల్ట్‌లో 93 శాతంమట్టి, 7 శాతం మాత్రమే ఇసుక ఉండటమే. ఈ మట్టిని డంపు చేయడానికి భూసేకరణ చేయాల్సిన పరిస్థితులున్నాయని గుత్తేదారులంటున్నారు. దీంతో ఎవరు ముందుకు రావడం లేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

డ్రిప్ స్కీమ్‌లో చేరిస్తే ప్రయోజనం

డ్యాం రియాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ (డ్రిప్) పథకంలో చేరిస్తే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం కింద ఎంపిక అయితే కేంద్ర ప్రభుత్వం 80శాతం, రాష్ట్రం 20 శాతంగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు. ఈ పథకంలో చేర్చేందుకు ప్రతిపాదన సైతం సిద్ధం చేశామని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటుందని నడిగడ్డ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షించిన విషయం తెలిసిందే. ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలంటే జూరాల ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>