కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర అప్పులపై తెలంగాణ భవన్ కు వస్తానని ప్రకటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ( Jupally Krishna Rao) కోసం కుర్చీ వేసి వేచి చూచిన రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని.. తాను చెప్పింది తప్పు అని తేలితే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఖబడ్దార్.. ఇష్టానుసారంగా మాట్లాడొద్దు
కేటీఆర్, హరీశ్ రావు ఇష్టానుసారంగా మాట్లాడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ముందుగా వారు తన చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. వారిలాగా తాను సిగ్గుమాలిన మాటలు మాట్లాడను అని ఫైర్ అయ్యారు. తనకు ఆత్మ గౌరవం ముఖ్యమన్న ఆయన.. ఈ రోజు కూడా తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్ లో చర్చిద్దాం రండి అని కేటీఆర్, హరీశ్ రావులకు ఛాలెంజ్ విసిరారు. తన ఆరోపణలు తప్పు అని నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అయితే నిరూపించకపోతే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? అని నిలదీశారు. ఈ విషయంపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు లేఖలు పంపుతున్నా.. తన ఆరోపణలపై సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

