కలం, నిర్మల్: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నిర్మల్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఖానాపూర్, నిర్మల్, ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6,42,174 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో పురుషులు 3,11,521 మంది, మహిళలు 3,30,624 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 29 మంది ఉన్నారు. అదనంగా 8 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 992 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్ లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, జాబితాలో పేర్ల మార్పులు, చేర్పులు, తొలగింపులు, ఇతర వివరాల సవరణలకు సంబంధించి నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను పరిశీలించుకుని తప్పులు ఉంటే సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వచ్చిన క్లెయిమ్ లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించిన అనంతరం 2026 అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఓటర్లందరూ ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు, వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే నిర్ణీత గడువులో సవరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఖానాపూర్ నియోజకవర్గం:
పురుషులు 98,712, మహిళలు 1,01,445, థర్డ్ జెండర్ 8, మొత్తం జనరల్ ఓటర్లు 2,00,165 మంది. ఎన్ఆర్ఐ ఓటర్లు 4, సర్వీస్ ఓటర్లు 443 మంది.
నిర్మల్ నియోజకవర్గం:
పురుషులు 1,04,097, మహిళలు 1,15,656, థర్డ్ జెండర్ 10, మొత్తం జనరల్ ఓటర్లు 2,19,763 మంది. ఎన్ఆర్ఐ ఓటర్లు 4, సర్వీస్ ఓటర్లు 248 మంది.
ముధోల్ నియోజకవర్గం:
పురుషులు 1,08,712, మహిళలు 1,13,523, థర్డ్ జెండర్ 11, మొత్తం జనరల్ ఓటర్లు 2,22,246 మంది. సర్వీస్ ఓటర్లు 301 మంది.

