కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ (Rich Kids Trap Case) వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తాజాగా మరో మహిళను అరెస్ట్ చేశారు. పోక్సో బాధితురాలిని భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. సరస్వతి అనే మహిళ బాధితురాలి ఇంట్లో పనిమనిషిగా ఉంటోంది. ఈ క్రమంలో మైనర్ బాధితురాలు నిందితుడు అర్జున్‌కు సరస్వతి ఫోన్ నుండి పలుమార్లు కాల్స్ చేసింది. ఈ విషయాన్ని గమనించిన సరస్వతి ఆ మైనర్ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది.
ఫోన్ చేసిన విషయాన్ని ఇంట్లో చెబుతానంటూ బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసింది. ఇంట్లో చెప్పకుండా ఉండాలంటే తనకు రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన మైనర్ బాధితురాలు తన ఇంట్లో ఉన్న రూ.9 లక్షల నగదును తీసుకొచ్చి సరస్వతికి అప్పగించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితురాలు సరస్వతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని కోణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

