కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పలు వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి (Kethepally) పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పంట పొలాల్లోని గడ్డికి కొందరు స్థానికులు నిప్పు పెట్టారు. అయితే, ఎండ తీవ్రతకు తోడు ఒక్కసారిగా గాలులు బలంగా వీచడంతో ఆ మంటలు కాస్తా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వేగంగా వ్యాపించాయి.
పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వివిధ కేసుల్లో భాగంగా పోలీసులు సీజ్ చేసి ఉంచిన వాహనాలకు ఈ మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే మంటలు ఉధృతం కావడంతో, సీజ్ చేసిన పలు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్టేషన్ ఆవరణలో దట్టమైన పొగలు అలుముకోవడంతో సిబ్బంది, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

