కలం, నల్లగొండ : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపులో భాగంగా నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఈ-ఫార్మసీ (ఆన్‌లైన్ ఫార్మసీ) కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా, స్థానిక ఫార్మసీ వ్యాపారుల మనుగడను కాపాడాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో కెమిస్టులు, డ్రగ్గిస్టులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆన్‌లైన్ మందుల విక్రయాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడుతూ వ్యాపారులు నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫార్మసిస్టులు, మెడికల్ షాపుల యజమానులు ఈ ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ (వైద్యుల చిట్టీ) లేకుండానే ఆన్‌లైన్ సంస్థలు మందులను విచ్చలవిడిగా హోమ్ డెలివరీ చేస్తున్నాయని వ్యాపారులు ఆరోపించారు.
ఈ-ఫార్మసీల వల్ల నకిలీ మందులు, గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) మెడిసిన్ మార్కెట్లోకి వచ్చే ప్రమాదం పెరిగిందని, ఇది ప్రజల ఆరోగ్య భద్రతకు పెను సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల 24 గంటల పాటు నిరంతరాయంగా ప్రజలకు సేవలందిస్తున్న స్థానిక చిన్న మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. “మేము చేస్తున్న ఈ పోరాటం కేవలం మా వ్యాపారాల కోసం కాదు.. ప్రజల ఆరోగ్య భద్రత కోసం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ-ఫార్మసీలను తక్షణమే నియంత్రించాలనీ ఫార్మసీ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్థానిక ఫార్మసీ రంగాన్ని ఆదుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ-ఫార్మసీల నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌తో పలుచోట్ల రోగులు మందుల కోసం ఇబ్బందులు పడినప్పటికీ, ప్రజల భవిష్యత్తు కోసమే ఈ పోరాటమని నిర్వాహకులు తెలిపారు.

