కలం, వెబ్ డెస్క్: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హైదరాబాద్‌లో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఫహద్ ఫాజల్ హీరోగా నటిస్తుండగా.. దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నా మొదటి చిత్రం ఓపెనింగ్ రోజు నేను ఒక్కడినే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాను. అమ్మకు బయటకు వెళ్లే అలవాటు లేదు.. నాన్నను అడిగితే నువ్వే ఒక్కడివే వెళ్లాలి.. సొంతంగా నేర్చుకోవాలి అన్నారు. దీంతో ఒక్కడినే వెళ్లాను. మొదటి సినిమాకు తోడు ఎవరూ లేరని అప్పుడు ఎంతో బాధ కలిగింది’ అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘దేవుడు నాకు ఎంతో మంది ఫ్యాన్స్‌ను ఇచ్చాడు. అది సరిపోలేదేమో.. నాకు రాజమౌళి, కీరవాణి కుటుంబాన్ని ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అంత అద్భుతంగా వచ్చిందంటే దానికి వెనుక రాజమౌళితో పాటు కార్తికేయ కష్టం ఎంతో ఉంది. నాకు ఎన్నో సార్లు కార్తికేయ అండగా నిలబడ్డాడు. నాకు సొంత తమ్ముడు లాంటి వాడు. అతను నిర్మాతగా వస్తున్న చిత్రం భారీ హిట్ సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.
చేయి నొప్పి తగ్గింది..
డ్రాగన్ మూవీ షూటింగ్ త్వరలోనే మళ్లీ మొదలుపెట్టబోతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. చేయి నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. 2027, జూన్ 11వ తేదీనే థియేటర్లలో విడుదల కాబోతుందన్నారు. ఈ సందర్భంగా రాజమౌళిని కూడా వారణాసి మూవీ లేట్ అవుతుందా.. అని వ్యంగ్యంగా అడుగుతూనే, 2027, ఏప్రిల్ 7వ తేదీనే విడుదలవుతుందని రాజమౌళి నవ్వుతూ చెప్పారు. ఈ సందర్భంగా హీరో ఫహద్ ఫాజల్‌తో కలిసి ఎన్టీఆర్ తొడ కొట్టించి అభిమానులను అలరించారు. ఫహద్ అద్భుతమైన నటుడని.. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరన్నారు.

