కలం, వెబ్ డెస్క్: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ఓపెనర్ జోష్ ఇంగ్లీస్ ఊచకోత కోశాడు. స్టేడియంలో బౌండ్రీల మోత మోగించాడు. ఇంగ్లీస్ నిలకడగా ఆడుతున్న సమయంలో ఆయుష్ బదోనీ మాత్రం దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌లో ఊపు తీసుకొచ్చాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జయంట్స్ 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో చాహల్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. చివర్లో అబ్దుల్ సమద్ సిక్సర్లతో విరుచుకుపడటంతో లక్నో జట్టు పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (0) తొలి ఓవర్లలోనే అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ వెంటనే వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ (2) కూడా మార్కో జాన్సెన్ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి లక్నో కష్టాల్లో పడిన వేళ.. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో స్కోరు బోర్డును ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ ఆయుష్ బదోనీ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 238.88 స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్ గేర్ మార్చాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని యుజ్వేంద్ర చాహల్ విడదీశాడు. బదోనీని స్టంప్ అవుట్ చేయడంతో పాటు, కెప్టెన్ రిషభ్ పంత్ (26 పరుగులకు 22 బంతులు) ను కూడా పెవిలియన్ చేర్చి లక్నోను దెబ్బకొట్టాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జోష్ ఇంగ్లిస్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసి శశాంక్ సింగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
చివరి ఓవర్లలో అబ్దుల్ సమద్ మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను టార్గెట్ చేస్తూ స్టేడియం నలుమూలలా షాట్లు బాదాడు. సమద్ కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అర్జున్ టెండూల్కర్ (5 నాటౌట్) అతనికి సహకారం అందించాడు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్ 2 వికెట్లు, ఒమర్జాయ్, శశాంక్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ 3 ఓవర్లలోనే 52 పరుగులు సమర్పించుకుని భారీగా పరుగులను ఇచ్చుకున్నాడు.

