కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ జిల్లాకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ గ్రూప్ సెంటర్ (Central Forces Group Centre) ఏర్పాటు కాబోతుండటం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని కేటాయించాలంటూ తాను తెలంగాణ ప్రభుత్వానికి చేసిన అధికారిక అభ్యర్థనకు సానుకూల స్పందన లభించిందని వెల్లడించారు. గ్రూప్ సెంటర్ స్థాపన కోసం జిల్లాలో 14 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో కరీంనగర్‌కు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తీసుకురావడానికి తాను నిరంతరం కృషి చేశానని బండి సంజయ్ వివరించారు.
అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్‌తో తాను జరిపిన చర్చల అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలనే నిబంధనతో ఈ గ్రూప్ సెంటర్ ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. తాజాగా తెలంగాణ కేబినెట్ ఆమోదించిన వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం వెల్ది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో 5 ఎకరాలు, అలాగే గన్నేరువరం మండలంలో మరో 5 ఎకరాల భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాల కోసం ప్రతిపాదించిన ఈ గ్రూప్ సెంటర్ వల్ల ప్రాంతీయ భద్రతా మౌలిక సదుపాయాలు బలోపేతం కావడమే కాకుండా, కరీంనగర్ జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

