కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత నిచ్చి రైతు భరోసా (Rythu Bharosa) నిధులతో ఆదుకుంటుందని, మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో టీపీసీసీ ఆదేశాల మేరకు, మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి, రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అత్యంత వేగంగా నిధులను విడుదల చేస్తోందన్నారు. కేవలం వారం రోజుల్లోనే రూ.7,750 కోట్లకు పైగా నిధులు విడుదల చేసి, రాష్ట్రవ్యాప్తంగా 68.96 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించిందని ఆయన అన్నారు. దీంతో 129.17 లక్షల ఎకరాల సాగు భూమికి ఆర్థిక భరోసా కల్పించబడిందని అన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో దళారుల ప్రమేయం లేకుండా, లీకేజీలకు తావులేకుండా, నూతన రెవెన్యూ వెరిఫికేషన్ వ్యవస్థ ద్వారా నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని ఆయన అన్నారు.
జూన్ 30వ తేదీన ప్రారంభమైన ఈ ప్రక్రియలో చిన్న, సన్నకారు రైతులకే తొలి ప్రాధాన్యత కల్పించారన్నారు. ఒకటి, రెండు ఎకరాల నుంచి ప్రారంభించి ఐదో రోజు నాటికి 5 ఎకరాలలోపు ఉన్న రైతులందరికీ నిధులు పూర్తిగా జమ చేసినట్లు తెలిపారు. తాజాగా ప్రభుత్వం 7వ విడత నిధులుగా, 7 నుంచి 8 ఎకరాల లోపు భూమి ఉన్న 58,831 మంది రైతులకు రూ.259.73 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే 7 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ నిధులు అందగా, మిగిలిన అర్హులైన రైతులకు కూడా త్వరలోనే పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.
పునర్వ్యవస్థీకరించిన మార్గదర్శకాల ప్రకారం రైతులకు ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ.6,000 చొప్పున (ఏడాదికి రూ.12,000) పెట్టుబడి సాయం అందజేస్తోందనీ, అదేవిధంగా రూ.5 లక్షల రైతు బీమా, వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అండగా నిలుస్తోందనీ ఆయన తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ, రియల్ ఎస్టేట్ ప్లాట్లు, సాగుకు అనర్హమైన భూములను మినహాయించి, నిజమైన అర్హులైన రైతులకే ఈ లబ్ధి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం విశేషమన్నారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనితా రెడ్డి, మీడియా సెల్ సీజే బెనార్, డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ జనరల్ సెక్రటరీ రాములు యాదవ్, డోమ పరమేశ్, హన్వాడ మండల అధ్యక్షుడు మహేందర్, జిల్లా మత్స్య శాఖ సంఘం అధ్యక్షుడు గొనేల శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పసుల రాజు, డీసీసీ కమిటీ సభ్యులు రమేష్ శెట్టి, పులిజాల రవికిరణ్, ఉషారాణి, సేవాదళ్ అబూకర్, వెంకట్ లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు మల్లేష్ యాదవ్, చందు యాదవ్, రాజేష్ ముదిరాజ్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి హరీష్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

