కలం వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా లెజెండ్రీ బ్యాటర్ రికీ పాంటింగ్(Ricky Ponting) టెస్ట్ సెంచరీ రికార్డ్(Test Century Record)ను ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) సమం చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో యాషెస్ టెస్టులో జో రూట్ తప 41వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో రూట్ ఆల్‌టైమ్ టెస్ట్ శతకాల జాబితాలో పాంటింగ్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అతడికంటే ముందుగా సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), జాక్ కాలిస్ మాత్రమే ఉన్నారు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడిన తర్వాత రెండో రోజు 72 పరుగులతో క్రీజులోకి వచ్చిన రూట్.. ఇంగ్లండ్ బ్యాటింగ్ భారాన్ని భుజాలపై వేసుకున్నాడు. హ్యారీ బ్రూక్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 169 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించాడు. బ్రూక్ 84 పరుగులు చేసి ఔటైనా ఆ వెంటనే వరుసగా వికెట్లు కూలిన వేళ రూట్ చల్లగా నిలబడ్డాడు.
146 బంతుల్లో శతకం పూర్తి చేసిన రూట్, ఆ తర్వాత గేర్ మార్చి 150 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇంగ్లాండ్ స్కోరు 350 దాటిన దశలో అతడి ఇన్నింగ్స్ మరింత ఆకర్షణీయంగా మారింది. చివరికి మైఖేల్ నెసర్ అద్భుతమైన క్యాచ్ అండ్ బౌల్డ్‌తో రూట్‌ను పెవిలియన్‌కు పంపించాడు. రూట్ 160 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌట్ అయింది. యాషెస్ వంటి పెద్ద వేదికపై వచ్చిన ఈ శతకం జో రూట్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. కీలక సమయంలో జట్టును ఆదుకునే ఆటగాడిగా అతడు మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.
అత్యధిక టెస్ట్ శతకాలు చేసిన టాప్ 5 ఆటగాళ్లు
సచిన్ టెండూల్కర్ – 200 మ్యాచ్‌ల్లో 51 సెంచరీలు
జాక్ కాలిస్ – 166 మ్యాచ్‌ల్లో 45 సెంచరీలు
రికీ పాంటింగ్ – 168 మ్యాచ్‌ల్లో 41 సెంచరీలు
జో రూట్ – 163 మ్యాచ్‌ల్లో 41 సెంచరీలు
కుమార సంగక్కార – 134 మ్యాచ్‌ల్లో 38 సెంచరీలు


