కలం, వెబ్‌డెస్క్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ (Jharkhand) విజేతగా నిలిచింది. గురువారం పుణే వేదికగా జరిగిన ఫైనల్లో 69 పరుగుల తేడాతో హర్యానాపై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. జార్ఖండ్ ఈ కప్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 262 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్, ఓపెనర్ ఇషాన్ కిషన్(101; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచరీ, వన్‌డౌన్‌లో కుమార్ కుశాగ్ర (81; 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరవీహారం చేశారు. ఆఖర్లో అనుకుల్ రాయ్(40 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాబిన్ మింజ్(31 నాటౌట్; 14 బంతుల్లో 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. హర్యానా బౌలర్లలో సుమిత్ కుమార్, అన్షుల్ కాంభోజ్, సమంత్ జకర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్, కెప్టెన్ అంకిత్, వన్‌డౌన్ బ్యాటర్ ఆశిష్ డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ అర్ష్ రాణా 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో 36 పరుగులకే టాపార్డర్ వికెట్లు చేజార్చుకున్న హర్యానా ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. మిడిలార్డర్లో యశ్వర్ధన్(53; 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), నిశాంత్ సింధు (31; 15 బంతుల్లో 6 ఫోర్లు), సమాంత్ జకర్(38; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆశలు కల్పించినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. చివరికి హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జార్ఖండ్ (Jharkhand) బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాల్ కృష్ణ చెరో 3 వికెట్లు తీయగా, అనుకుల్ రాయ్, వికాస్ సింగ్ చెరో 2 వికెట్లు పంచుకున్నారు. ఇషాంత్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అనుకుల్ రాయ్‌కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించాయి.


