Mobile Popup Ad
Mobile Popup Ad

అన్నదాతను ముంచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: రైతు పండించిన మక్కలను కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతను నట్టేట ముంచుతోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ధ్వజమెత్తారు. సోమవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రైతు భరోసా అని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు పంటలనే కొనలేని స్థితిలో ఉందని, ఇది కాదా రైతు ద్రోహం? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొనుగోలు చేసిందన్నారు. వరికి బదులు మొక్కజొన్న, పప్పు దినుసులు పండించాలని ప్రభుత్వం చెబితే మొక్క జొన్న వేశారని, తీరా ఇప్పుడేమో కొనుగోలు చేయడం లేదన్నారు. రాయికల్ మార్కెట్లో తూకం వేసి 20 రోజులైనా మిల్లులకు తరలించలేదని మండిపడ్డారు.

అందుబాటులో లేకపోవడమేనా ప్రజా పాలన..?

ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడమేనా.. అని జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. కావాలనే కొనుగోళ్లు ఆలస్యం చేస్తూ రైతులను దళారుల చేతిలో పెట్టిందని.. వర్షాలు పడితే ధాన్యం తడిసిపోయి రైతులకు తీరని నష్టం కలుగుతుందన్నారు. 48 గంటల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేకుంటే రైతుల పక్షాన మా పోరాటం కొనసాగుతుందని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు నిరసన, ధర్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంకా నాలుగు పంటలు అయిపోతే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు.

రెండో సారి మోసం చేసిన ప్రభుత్వం..

మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ అని మోసం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పంట కొనకుండా రెండోసారి మోసం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి రైతును రాజును చేశామని, ఇప్పుడు రైతును బిచ్చగాడిని చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు వచ్చి సాయంత్రం వరకు ఐదు లారీలు తెచ్చి ధాన్యాన్ని తరలిస్తామని హామీ ఇచ్చారు. రోజుకు అయిదు లారీలు తెప్పించి మొత్తం ధాన్యం కొనుగోలు చేసి మిలర్లకు తరలస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

Read Also: బాలికల విద్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Read Also: సర్కార్ ఆస్పత్రులు అస్తవ్యస్తం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>