కలం, కరీంనగర్ బ్యూరో: ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, వెంటనే వాటిని అమలు చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) డిమాండ్ చేశారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆటో కార్మికులు వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రెక్కాడితే..డొక్కాడని కుటుంబాలు ఆటో కార్మికులవని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో అండగా నిలిచాం:
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటో కార్మికులకు అన్ని విధాలా అండగా నిలిచారని గంగుల (Gangula Kamalakar) గుర్తు చేశారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ప్రమాదవశాత్తు మరణించిన ఆటో కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షలు అందించామని తెలిపారు. అదేవిధంగా, ఆటో ఫిట్‌నెస్ కోసం చెల్లించాల్సిన సుమారు రూ.350 కోట్లను ప్రభుత్వమే విడుదల చేసి కార్మికులపై ఎలాంటి భారం పడకుండా చేశామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు:
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కినట్లే.. ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ఊసే ఎత్తలేదని ధ్వజమెత్తారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, తాము ఈ పథకానికి వ్యతిరేకం కానప్పటికీ.. దాని వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఆటో ఈఎంఐలు కట్టలేక ఎంతమంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులకు ఏటా రూ.12,000 భృతి చెల్లించడంతో పాటు, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read : యువతకు అజిత్ దోవల్ కీలక సూచన
Follow Us On: Sharechat

