కలం, స్పోర్ట్స్ : టెన్నిస్ కోర్టులో ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా కనిపించే ఇటలీ స్టార్ ప్లేయర్ జాస్మిన్ పావ్లిని (Jasmine Paolini) ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్‌లో అనూహ్య ఓటమి తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో మాట్లాడలేక ప్రెస్ మీట్ నుండి మధ్యలోనే బయటకు వెళ్ళిపోయిన ఆమె, ఆ తర్వాత తిరిగి వచ్చి తన బాధను పంచుకున్నారు.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో పావ్లిని ప్రయాణం గెలుపుతోనే మొదలైంది. మొదటి రౌండ్‌లో దయానా యాస్ట్రెంస్కాపై 7-5, 6-3 తేడాతో అద్భుత విజయం సాధించి ఆమె రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. అయితే రెండో రౌండ్‌లో అర్జెంటీనాకు చెందిన 21ఏళ్ల యువ సంచలనం సొలానా సియెర్రా రూపంలో ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి సెట్ గెలిచినప్పటికీ, ఆ తర్వాత సియెర్రా పుంజుకోవడంతో పావ్లిని ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఈ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన పావ్లిని, ఇటాలియన్ ఓపెన్ సమయం నుండి తను ఎదుర్కొంటున్న పాదం నొప్పే ఈ పరాజయానికి ప్రధాన కారణమని చెప్పారు. అందుకే ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్‌లో కూడా ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు వివరించారు. కోర్టులో తన వంద శాతం ఆటను ప్రదర్శించలేకపోయానని, ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
నిజానికి ఈ ఏడాది పావ్లినికి పెద్దగా కలిసిరాలేదు. బేస్‌లైన్ నుండి ఎంతో దూకుడుగా ఆడే ఆమె శైలి ఈ సీజన్ లో అంతగా పండలేదు. స్టట్‌గార్ట్, మాడ్రిడ్, రోమ్ వంటి పెద్ద టోర్నమెంట్‌లలో ఆమె ముందే నిష్క్రమించారు. ఈ ఏడాది కేవలం మెరిడా ఓపెన్‌లో మాత్రమే సెమీఫైనల్ చేరడం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. ఫ్రెంచ్ ఓపెన్ ముగిసేసరికి ఈ సీజన్‌లో ఆమె గెలుపోటముల రికార్డు పదకొండు-పదకొండు (11-11) గా సమంగా నిలిచింది. పాదం గాయం తీవ్రత దృష్ట్యా, పూర్తిగా కోలుకోవడానికి ఆమె రాబోయే కొన్ని టోర్నమెంట్‌లకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు, పావ్లినిని ఓడించిన యువ ప్లేయర్ సొలానా సియెర్రా మాత్రం అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారు. వరుసగా ఎమ్మా రాడుకాను, పావ్లిని వంటి టాప్ ప్లేయర్లను ఓడించి ఆమె మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. తదుపరి రౌండ్‌లో సియెర్రా.. సీనియర్ ఆటగాడు సొరానా క్రిస్టియాతో తలపడనున్నారు.

