కలం, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ (YSRCP) మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా బలహీన వర్గాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. అధికార కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు మాయమాటలు, నారా లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బీసీలకు వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలను తీసేసి, తాను ఇస్తానని చెప్పిన 50 ఏళ్ల వయసు వారికి పెన్షన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదన్నారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి పత్రాలు ఇచ్చి చెప్పిన మాటలు అన్నీ నేడు బూటకాలయ్యాయని దుయ్యబట్టారు. బీసీ కుటుంబాల పరిస్థితి మెరుగ్గా మారింది అంటే అందుకు కారణం నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే అని కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు సాగుతుంటే.. చంద్రబాబు హయాంలోరాష్ట్రం తిరోగమనంలో వెళుతుందని విమర్శించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను మించి ఇస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. రెండేళ్లు గడిచినా ఏ హామీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

