విద్య, వైద్యం, వ్యవసాయంలో జపాన్ నమూనా.. భద్రాద్రిలో మార్పులకు శ్రీకారం!

కలం, ఖమ్మం బ్యూరో : ​రెండో ప్రపంచ యుద్ధం మిగిల్చిన అణు విధ్వంసం నుంచి కేవలం క్రమశిక్షణ, విద్య, సాంకేతికత, దీర్ఘకాలిక ప్రణాళికలతో అగ్రరాజ్యంగా ఎదిగిన సూర్యోదయ దేశం జపాన్ అభివృద్ధి నమూనా (Japan Development Model) ఇప్పుడు మన్యం, సింగరేణి గడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రగతికి సరికొత్త దిశానిర్దేశం చేయనుంది. నీతి ఆయోగ్ గుర్తించిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌గా భద్రాద్రి కొత్తగూడెం, ఆస్పిరేషనల్ బ్లాక్‌గా గుండాల మండలం ఎంపికైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ నవంబర్ 15 నుంచి 21 వరకు జపాన్‌లో నిర్వహించిన ఏడు రోజుల అధ్యయన పర్యటన జిల్లా పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.

విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ఉత్తమ విధానాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా దశలవారీగా అమలు చేసేందుకు కలెక్టర్ కార్యాచరణ సిద్ధం చేయడం జిల్లా అభివృద్ధిలో కీలక మలుపుగా మారనుంది. ​విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు జపాన్ పాఠాలు మార్గదర్శకంగా నిలవనున్నాయి. నెరిమా నగరంలోని టొయోటామా ఎలిమెంటరీ పాఠశాల సందర్శనలో కలెక్టర్ గమనించిన అంశాలు మన ప్రభుత్వ, గిరిజన సంక్షేమ పాఠశాలల రూపురేఖలను మార్చగలవు. అక్కడ తరగతి గదులు, మరుగుదొడ్ల పరిశుభ్రత నుంచి మధ్యాహ్న భోజన మెనూ ఎంపిక, తయారీ వరకు విద్యార్థులే ప్రత్యక్ష భాగస్వాములుగా ఉండటం వల్ల చిన్ననాటి నుంచే స్వయం క్రమశిక్షణ, సామాజిక బాధ్యత అలవడుతున్నాయి.

పాఠశాల సమయం తర్వాత సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రిటైర్డ్, స్వచ్ఛంద ఉపాధ్యాయుల సహకారంతో ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చే విధానం ప్రైవేట్ కోచింగ్‌పై ఆధారపడకుండా మన్యంలోని పేద, గిరిజన విద్యార్థులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. జిల్లాలో ఇప్పటికే ముఖ గుర్తింపు హాజరు విధానంతో ఉపాధ్యాయుల హాజరు 91 నుంచి 92 శాతానికి చేరుకోగా, దీనికి జపాన్ తరహా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల వారాంతపు సమీక్షలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను జోడించి ప్రతి మండలంలో ఒక మోడల్ పాఠశాలను తీర్చిదిద్దడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతుంది.

​వ్యవసాయ రంగంలో ఇబరాకి ప్రాంతపు సహకార వ్యవసాయ విధానం భద్రాద్రి కొత్తగూడెం రైతులకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సుమారు 400 నుంచి 500 మంది రైతులు సంఘాలుగా ఏర్పడి పంటల ఎంపిక, సాగు, రుణాలు, గ్రేడింగ్, ప్యాకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సమష్టిగా ముందుకు సాగే తీరు మన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుంది. పరిమిత వనరులను ఆధునిక సాంకేతికతతో సమర్థవంతంగా వినియోగిస్తూ, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సేంద్రియ సాగు, ఆహార శుద్ధిని ప్రోత్సహిస్తే జిల్లాలోని అన్నదాతలు కేవలం పంటలు పండించే రైతులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం లభిస్తుంది.

​వైద్యం, పరిపాలన రంగాల్లోనూ జవాబుదారీతనం, సమయపాలన కీలకంగా మారనున్నాయి. వేగవంతమైన ఓపీ నమోదు, ఆసుపత్రుల పరిశుభ్రత, వైద్యులు-సిబ్బంది సమయపాలన వంటి అంశాలను అందిపుచ్చుకుని జిల్లాలో ఒక ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్‌గా అభివృద్ధి చేయాలన్న నిర్ణయం గ్రామీణ, గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తుంది.

మిటో నగర స్థానిక పాలన, కనగావా ప్రిఫెక్చర్‌లో స్టార్టప్‌లకు సులభతర అనుమతులు, సోనీ సంస్థ నాయకత్వ నైపుణ్యాల వంటి కేస్ స్టడీలు జిల్లా యంత్రాంగంలో పనితీరును, నిర్ణీత గడువులో సేవలు అందించే సంస్కృతిని మరింత పటిష్టం చేస్తాయి. ​అటవీ ప్రాంతాలు, రహదారి అనుసంధానం, నెట్‌వర్క్ సమస్యలు వంటి భౌగోళిక సవాళ్లు ఉన్నప్పటికీ, జిల్లాలో అమలవుతున్న ‘అమ్మ ఆదర్శ పాఠశాలలు’, మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరుపై జపాన్ ప్రతినిధులు ప్రశంసలు కురిపించడం గమనార్హం. మన వద్ద ఉన్న బలమైన క్షేత్రస్థాయి వ్యవస్థలకు జపాన్ సాంకేతికత, క్రమశిక్షణ, పర్యవేక్షణ విధానాలను జోడిస్తే ఆశించిన ఫలితాలు సులువుగా సాధ్యమవుతాయి. ​

అధ్యయన పర్యటనల ఫలాలు సామాన్య ప్రజల జీవితాల్లో కనిపించే కార్యాచరణగా మారినప్పుడే వాటికి అసలైన సార్థకత ఉంటుంది. కలెక్టర్ అంకిత్ వెల్లడించినట్లుగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఈ ఉత్తమ విధానాలను దశలవారీగా, స్థానిక అవసరాలకు తగ్గట్టుగా అమలు చేయగలిగితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేశంలోని ఆకాంక్షిత జిల్లాలకే ఆదర్శంగా నిలవడం ఖాయం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>