కలం, వెబ్డెస్క్: ఏపీలో మరో రాజకీయ పాదయాత్రకరు ముహూర్తం కుదిరింది. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు విజయ సాయిరెడ్డి (Vijayasai Reddy)ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే విజయసాయిరెడ్డి సొంత పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి పరివర్తన రాజనీతి పార్టీ అని పేరు కూడా పెట్టారు. ఈ సందర్భంగా పీఆర్పీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విజయ సాయిరెడ్డి నడుంబిగించారు. నేడు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పరివర్తన రాజకీయ పార్టీలో అట్టడుగు వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీని దశాబ్దాలుగా రెండు పార్టీలే పరిపాలిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ధోరణిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తాను పార్టీకి అధినేత అయినప్పటికీ సీఎం అభ్యర్థి మాత్రం కాదన్నారు. థాక్రేలాగా తాను కూడా పార్టీకి రాజకీయ సలహాదారుగా ఉంటానని వెల్లడించారు. జెన్ జీ యువత రాజకీయాల్లోకి రావాలని సాయిరెడ్డి పిలుపునిచ్చారు. చట్టాల రూపకల్పనలో యువత పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఉగాది తర్వాత తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. ఈ పాదయాత్ర ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ, గ్రామాల్లో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ సాగుతుందని చెప్పారు. తమ పార్టీలో యువతకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మునుపెన్నడూ లేని విధంగా రాజకీయాల్లో సరికొత్త విప్లవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

