కలం, వెబ్ డెస్క్ : ఫ్రెంచ్ ఓపెన్ (French Open) పై భానుడి ప్రతాపం పడింది. ఎండ దెబ్బకు టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నంబర్ వన్ జానిక్ సిన్నర్ (Jannik Sinner).. రెండో రౌండ్‌లోనే టోర్నీ నుంచి బయటపడ్డాడు. చేతిలో ఉన్న మ్యాచ్‌ను చివరి క్షణాల్లో జారవిడిచిన ఇటాలియన్ స్టార్.. పారిస్ ఎండకు తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ తప్పుకోవడంతో టైటిల్‌కు ప్రధాన ఫేవరెట్‌గా కనిపించిన సిన్నర్.. అర్జెంటీనా ఆటగాడు జువాన్ మాన్యుయెల్ సెరుండోలో చేతిలో 6-3, 6-2, 5-7, 1-6, 1-6 తేడాతో ఓడిపోయాడు.
మ్యాచ్ ప్రారంభం నుంచి రెండు గంటలకు పైగా సిన్నర్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. రెండు సెట్లు సులభంగా గెలిచాడు. మూడో సెట్లో 5-4 ఆధిక్యంలో నిలిచి.. విజయానికి ఒక్క గేమ్ దూరంలో ఉన్నాడు. కానీ అక్కడే మ్యాచ్ కథ పూర్తిగా మారిపోయింది. పారిస్‌లో 32 డిగ్రీల ఎండ తీవ్రంగా ఉండటంతో సిన్నర్ అలసటకు గురయ్యాడు. కోర్టులోనే పలుమార్లు వంగి ఊపిరి పీల్చుకుంటూ కనిపించాడు. తలనిర్బంధం, వికారం అనిపించడంతో అంపైర్ సహాయం కోరాడు.
చికిత్స కోసం కోర్టు బయటకు వెళ్లిన సిన్నర్.. మెడకు ఐస్ ప్యాక్‌లు పెట్టుకుని తిరిగి వచ్చినా.. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఆశ్చర్యకరంగా.. ఒక దశలో సిన్నర్ వరుసగా 18 పాయింట్లు కోల్పోయాడు. ఇక ఆ అవకాశాన్ని సెరుండోలో అస్సలు వదల్లేదు. వరల్డ్ నంబర్ 56 ఆటగాడు పొడవైన ర్యాలీలతో సిన్నర్‌ను మరింత అలసటకు గురిచేశాడు. మూడో సెట్ గెలిచిన తర్వాత పూర్తి దూకుడు చూపించి.. చివరి రెండు సెట్లలో మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
సిన్నర్ సాధారణ బంతులను కూడా చేరుకోలేని పరిస్థితికి వెళ్లగా.. సెరుండోలో నిర్భయంగా దాడి చేస్తూ కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో అతను తొలిసారి గ్రాండ్‌స్లామ్ మూడో రౌండ్‌కు చేరాడు. ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న సిన్నర్ 30 మ్యాచ్‌ల విజయపరంపరకు కూడా ఈ ఓటమితో తెరపడింది. రోమ్, మాడ్రిడ్, మాంటే కార్లో, మియామి, ఇండియన్ వెల్స్ టైటిళ్లతో పారిస్‌కు వచ్చిన సిన్నర్.. ఈసారి కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేస్తాడని చాలామంది భావించారు. కానీ చివరకు.. పారిస్ ఎండ, శారీరక అలసట, అనూహ్య పోరాటం కలిసి సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్ కలను రెండో రౌండ్‌లోనే ముగించేశాయి.

