కలం, వరంగల్ బ్యూరో: చనిపోయిన వ్యక్తి ఆత్మ రూపంలో బతికున్న మనిషిలోకి ప్రవేశించడం సినిమాల్లో సహజంగా చూస్తుంటాం. కానీ జనగామ జిల్లాలో ఇలాంటి విచిత్రమైన సంఘటనకు రిజిస్ట్రేషన్ కార్యాలయం వేదికైంది. పదేళ్ల కిందట చనిపోయిన వ్యక్తి వచ్చి తన పేరిట ఉన్న భూమిని మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం, సదరు రిజిస్ట్రేషన్ అధికారులు డాక్యుమెంట్స్ జారీ చేయడం కలకలం రేపుతోంది. డబ్బుల కోసం ఆఫీస్ అధికారులు, సిబ్బంది మిలాఖతై లేని వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగింది?
2000 సంవత్సరంలో అప్పటి టీఎన్జీవోస్ యూనియన్ జనగామ (Jangaon) అధ్యక్షుడు ఎండి మహబూబ్ హుస్సేన్ పాలకుర్తి మండలం వల్మిడికి చెందిన భారత చంద్రయ్య (ప్రభుత్వ ఉద్యోగి)కు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని 53/1 సర్వే నంబర్‌లోని 85వ నంబర్ ప్లాట్‌ను విక్రయించాడు. ఈ మేరకు హుస్సేన్ నుంచి 1706/2000 డాక్యుమెంట్‌తో 220 చదరపు గజాల ప్లాటును సేల్ డీడ్‌తో చంద్రయ్య రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కాగా 2014లో చంద్రయ్య మృతి చెందాడు. కానీ 09-09-2025 రోజున భారత చంద్రయ్య, నివాసం శ్రీనగర్ కాలనీ, హనుమకొండ జిల్లా, ఆధార్ నంబర్ [Aadhaar Redacted] తప్పుడు గుర్తింపు డాక్యుమెంట్‌తో జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన గౌరగళ్ళ యాకయ్యకు 220 చదరపు గజాలు రిజిస్ట్రేషన్ అయినట్లు జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. అయితే పదేళ్ల కిందట చనిపోయిన వ్యక్తి ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేశాడనేది విస్మయానికి గురి చేస్తోంది.
చేతులు మారిన ప్లాటు
మరణించిన వ్యక్తి వచ్చి రిజిస్ట్రేషన్ చేసిన 85వ నంబర్ ప్లాట్ పేరిట సృష్టించిన డాక్యుమెంటు చేతులు మారుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాట్ యజమాని నుండి 2000 సంవత్సరంలో భారత చంద్రయ్యకు, భారత చంద్రయ్య నుండి 9-9-2025 సంవత్సరంలో జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన గౌరుగళ్ళ యాకయ్యకు, 10-11-2025 తేదీన జనగామ పట్టణం సంజయ్ నగర్‌కు చెందిన గోగుల తిరుపతికి, 31 మార్చి 2026న రఘునాథపల్లి మండలానికి చెందిన రాజేందర్‌కు రిజిస్ట్రేషన్ అయినట్లు డాక్యుమెంట్ల ప్రకారం తెలుస్తోంది.
నకిలీ పత్రాలతో దందా
జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ల దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెట్ సెంటర్ నిర్వాహకులతో పాటు డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది సాయంతో ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు సమాచారం. చనిపోయిన భారత చంద్రయ్య పేరిట తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయడం ఈ ఘటనలకు ఉదాహరణగా చెప్పవచ్చు.
డబ్బులు ఇస్తే సరే?
జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (Jangaon Sub-Registrar Office)లో డబ్బులు ఇస్తే ఎలాంటి పనైనా జరుగుతుందనే విమర్శలున్నాయి. ఒక్కో పనికి ఒక రేటు నిర్ణయించి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మాదిరిగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిర్వహించే ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పిన వారికి నిబంధనలు పక్కన పెట్టి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల హనుమకొండ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అవినీతి బాగోతం బయట పెట్టారు. ఈ నేపథ్యంలో జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

