జనగామలో హోటళ్లు, బార్లపై ఆకస్మిక తనిఖీలు

కలం, జనగామ: ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జనగామ మున్సిపాలిటీ (Jangaon Municipality) ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, ఆహార విక్రయ (Food Safety Inspections) కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, గడువు ముగిసిన వస్తువుల వినియోగం, ఆహార నిల్వ విధానం, వ్యర్థాల నిర్వహణ, ఫుడ్ హ్యాండ్లర్ల వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ తనిఖీలలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించని, ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన సంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయడంతో పాటు జరిమానాలు విధించారు. గడువు ముగిసిన, నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. తనిఖీల్లో భాగంగా అమృత బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.20 వేల, మరో సంస్థకు రూ.20 వేల, వినాయక బార్‌కు రూ.30 వేల, బాలాజీ బార్‌కు రూ.10 వేల, బాలాజీ స్వీట్ హౌస్‌కు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.85 వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ల యాజమాన్యాలు ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆహారాన్ని తయారు చేసి వినియోగదారులకు అందించాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే వినియోగించాలని, ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే జనగామ మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు గొర్రె కుమార్, పులి శేఖర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>