కలం, వెబ్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup)-2026 ముగింపు వేడుకకు రంగం సిద్ధమైంది. జూలై 19న న్యూయార్క్-న్యూజెర్సీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్కు ముందు ఈ వేడుక జరగనుంది. టోర్నీలో పోటీ పడిన 48 జట్ల ప్రయాణాన్ని ఈ కార్యక్రమంలో గుర్తు చేయనున్నారు. ఈ వేడుకలో లారా పౌసిని, నికోల్ షెర్జింగర్, రాబీ విలియమ్స్, ఐషోస్పీడ్ తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.
ఫైనల్కు ముందు అమెరికా జాతీయ గీతాన్ని జెన్నిఫర్ హడ్సన్ ఆలపించనున్నారు. ఆమె ప్రదర్శనతో ఫుట్బాల్ మహా సమరానికి తెరలేవనుంది. ఫుట్బాల్, సంగీతం, సంస్కృతిని కలిపి ఈ వేడుకను ప్రత్యేకంగా రూపొందించినట్లు ఫిఫా తెలిపింది. మరికొందరు కళాకారుల పేర్లను త్వరలో ప్రకటించనుంది. ముగింపు వేడుక మ్యాచ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందే మొదలవుతుంది. అభిమానులు ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని ఫిఫా సూచించింది.

