రసాభాసగా మున్సిపల్ సమావేశం.. ఎజెండా ప్రతులు చించి, కమిషనర్‌పైకి విసిరి!

కలం, జనగామ: జనగామ (Jangaon) మున్సిపల్ సర్వసభ్య సమావేశం బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పూర్తి కోరం లేకుండానే సమావేశాన్ని నిర్వహించి, ఎజెండాలోని అంశాలను ఆమోదించడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు గైర్హాజరైనప్పటికీ సమావేశాన్ని కొనసాగించడం వివాదానికి దారితీసింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కోరం అంశంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. అయినప్పటికీ చైర్మన్ ఎజెండాలోని అంశాలను ఆమోదిస్తూ సభ ముగిసినట్లు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు.

‘51 పేజీల ఎజెండాను కేవలం 11 నిమిషాల్లో ఎలా చదివి ఆమోదించారు’ అంటూ కమిషనర్‌ను ప్రశ్నించారు. అయితే కమిషనర్ సరైన సమాధానంతో ఆందోళనకు దారితీసింది. ఆగ్రహంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎజెండా ప్రతులను చించేసి కమిషనర్‌పై విసిరేశారు. అంతటితో ఆగకుండా సమావేశం అనంతరం బయటకు వెళ్తున్న కమిషనర్ కారుకు అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కౌన్సిలర్లను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది.

మొత్తంగా సమావేశంలో ఆమోదించిన బిల్లుల్లో ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఒక్కటి కూడా లేవని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ‘పట్టణ ప్రజా సమస్యలపై ఖర్చు పెట్టకుండా అవసర పనులకు ఖర్చులు పెడుతున్నారు’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ స్పందించారు. ‘సమావేశం ప్రారంభమైనప్పుడు 11 మంది సభ్యులు హాజరయ్యారు. వారిలో ఒకరిద్దరు మినహా మిగతా సభ్యులంతా బిల్లులను ఆమోదించారు. ఈ వ్యవహారంలో నేను చేసేది ఏమీ లేదు’ అని క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించాల్సిన మున్సిపల్ సమావేశం ఆరోపణలు, నిరసనలు, గందరగోళం మధ్య ముగియడం పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>