Mobile Popup Ad
Mobile Popup Ad

మహబూబ్‌నగర్‌లో ఖాళీ సిలిండర్లతో సీపీఐ ఆందోళన

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పెట్రోల్, డీజిల్ కొరత గ్యాస్ అధిక ధరలను నిరసిస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లతో బుధవారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంటల కోత సమయంలో డీజిల్ లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందని అన్నారు. కొరత లేదని పాలకులు ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ ధరలను రూ.993కు పెంచడంతో అది కాస్త రూ.3,100కు చేరిందని అన్నారు. అలాగే డీజిల్, పెట్రోల్ మీద లీటరుకు రూ.5, గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.50 పెంచడానికి ఆయిల్ కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయని ఆరోపించారు.

వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే ప్రమాదం ఉన్నందున ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్య వాద విధానాలను మోడీ ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం, యుద్ధం కంటే ముందు బ్యారెల్ ముడి చమురు ధర 72 డాలర్లు ఉంటే ఇప్పుడు 126 డాలర్లకు చేరుకుందని గుర్తు చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరల వల్ల హోటల్లు, రెస్టారెంట్లు చిన్న, పెద్ద ఆహార వ్యాపారాల మీద ఇప్పటికే భారం పడిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సైతం పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యాల్బణం పెరిగి ప్రజలపై మరింత అధిక భారం పడుతుందన్నారు.

అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని, చమురు గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద ఎందుకు ప్రజలు బారులు తీరుతున్నారని, దానికి ప్రభుత్వం ఇచ్చే సమాధానానికి వాస్తవానికి పొంతన లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కె. పద్మావతి, బి. కృష్ణ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు జి. సత్యనారాయణ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, లక్ష్మణ్, పట్టణ మహిళా కార్యదర్శి ఇందిరక్క, సుందర్ రాజ్, కృష్ణయ్య, విగ్నేష్ కుమార్, చిన్నమ్మ, మల్లేశ్వరి, లక్ష్మమ్మ, గౌలి సురేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>