కలం, వరంగల్ బ్యూరో : జనగామ (Jangaon) జిల్లా కేంద్రంగా మరోసారి కలెక్టర్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివాదం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నా, లేకపోయినా బీఆర్ఎస్ నేతలకు కలెక్టర్లతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పదేళ్ల కిందటే మొదలు
2016లో జిల్లాల పునర్విభజన తర్వాత జనగామ (Jangaon) జిల్లా ఏర్పడగా, తొలి కలెక్టర్‌గా దేవసేన నియమితులయ్యారు. అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో ఆమెకు విభేదాలు మొదలయ్యాయి. బతుకమ్మ చెరువు అభివృద్ధి పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కలెక్టర్ ఆరోపించగా, కలెక్టర్ తన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. కలెక్టర్ ఫోన్‌కు స్పందించరని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన బహిరంగంగానే విమర్శించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం చివరికి కలెక్టర్ బదిలీతో ముగిసింది.
ఇప్పుడు సీన్ రివర్స్
అప్పుడు అధికారంలో ఉన్న ముత్తిరెడ్డి కలెక్టర్‌పై ఫైర్ అయితే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రస్తుత కలెక్టర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఆరోపించారు. దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని, జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అదే సమయంలో జనగామలో బెల్ట్ షాప్‌లపై చర్యలు తీసుకోవడం లేదని, పేదలపై చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కలెక్టర్ చర్యలకు వ్యతిరేకంగా బాధితులతో కలిసి ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పదేళ్ల క్రితం జరిగిన ముత్తిరెడ్డి, దేవసేన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జనగామలో కలెక్టర్లు vs ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పునరావృతం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

