కలం, వెబ్ డెస్క్: ఏపీ పోలీసులు, ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు (Prof Nageshwar) మద్దతుగా పలువురు తెలంగాణ జర్నలిస్టులు బుధవారం ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై మాట్లాడిన సంగతి తెలిసిందే. సదరు జర్నలిస్టుల వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు తెలంగాణ జనసేన (Janasena) నేతలు ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు సంపత్ నాయక్ (Sampath Naik) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడతారని, ఆయన మొగోడు కాబట్టే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని సంపత్ నాయక్ పేర్కొన్నారు. ఆయన పెళ్లిళ్లు రాజ్యాంగ బద్ధంగానే చేసుకున్నారని వెల్లడించారు. కావాలంటే మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోండని జర్నలిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పవన్ ఏనాడూ తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదని సంపత్ నాయక్ (Sampath Naik) అన్నారు. ప్రతి సారి ఆయన మాటలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ హిందు ధర్మం కోసం అందరినీ ఏకం చేస్తున్నారని, ఈ క్రమంలో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వ లేక లెఫ్ట్ వింగ్ భావజాలాలున్న వారంతా ఏకమై ఈ కుట్రకు తెరలేపారన్నారు. ధర్మం గురించి, దేశం గురించి మాట్లాడే పవన్‌ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు అడ్డు వస్తే తొక్కుతామని హెచ్చరించారు. ఈ ప్రెస్‌మీట్‌లో సంపత్ నాయక్ పలువురు జర్నలిస్టుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పేరు పెట్టి మరీ అమర్యాదగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. సంపత్ నాయక్ వాడిన అసభ్యకర పదాలపై జర్నలిస్టులు తిరగబడ్డారు. అసలు జర్నలిస్టులను ఉద్దేశించి అలాంటి మాటలు ఎలా మాట్లాడుతారంటూ ఎదురుతిరిగారు. దీంతో కొద్దిసేపు మీడియా సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అయితే సంపత్ నాయక్ తాను అందరు జర్నలిస్టులను అలా అనలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Read Also: జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం
Follow Us On : WhatsApp

