Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాచలం రోడ్లపై దూసుకొస్తున్న ‘జామాయిల్’ మృత్యు వాహనాలు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) డివిజన్ పరిధిలో జామాయిల్ కర్ర అధిక లోడు వాహనాలు మృత్యుశకటాలుగా మారాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 టైర్ల లారీకి ఖాళీ బరువుతో కలిపి గరిష్ఠంగా 28 టన్నుల లోడు మాత్రమే అనుమతించాలి. వ్యవసాయానికి వాడే ట్రాక్టర్లపై 3 నుంచి 5 టన్నులకు మించకూడదు. అయితే, ఇవేమీ పట్టని రవాణాదారులు నిబంధనలను తుంగలో తొక్కుతూ కొండల్లా జామాయిల్ కర్రను పేర్చి, టన్నుల కొద్దీ అదనపు బరువుతో రహదారులపై దూసుకెళ్తున్నాయి. ​నిబంధనలు ఉల్లంఘిస్తే కనీస జరిమానాగా రూ.20 వేలతో పాటు ప్రతి అదనపు టన్నుకు రూ.2వేల చొప్పున భారీ ఫైన్లు విధించే అధికారం ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు కేవలం అంతంత మాత్రమే సాగుతున్నాయి. కొందరు అధికారుల కాసుల కక్కుర్తి, నెలవారీ మామూళ్ల మత్తు వలనే ఓవర్‌ లోడ్ వాహనాలు వే-బ్రిడ్జ్ రశీదులు లేకుండానే సులువుగా సరిహద్దులు దాటుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

భారీగా ట్రాఫిక్ జామ్..

​ఈ ప్రమాదాకర వాహనాల కారణంగా వల్ల భద్రాచలం వంతెన పరిసరాల్లో నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడమే కాకుండా రోడ్లు కూడా దారుణంగా ధ్వంసమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్టీవో అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. జామాయిల్ అక్రమ రవాణాను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>